సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ నటించిన ‘రోమాంచకం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అది చాలదన్నట్టుగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇది ‘స్పిరిట్’ని మించి ఆడాలని తనను కలిసిన సుమంత్‌కు చెప్పారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి డేటింగ్ యాప్‌ను క్రియేట్ చేయాలని కలలు కంటుంటాడు. దానికోసం తన స్నేహితుల సాయం కోరుతాడు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక)తో అన్వేష్‌కు పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగానూ.. ఆ తరువాత ప్రేమలో పడతారు. మైథిలి పుట్టినరోజు కావడంతో అన్వేష్ చెన్నై వెళతాడు. మైథిలికి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. మైథిలికి కాల్ చేసి తానున్నహోటల్‌కు రమ్మంటాడు. సరేనని చెప్పిన మైథిలి.. అతని ఫోన్ నంబర్‌ని బ్లాక్ చేస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలోనూ బ్లాక్ చేస్తుంది. ఏమీ అర్థం కాని అన్వేష్ హైదరాబాద్‌కు తిరిగి వస్తాడు. కొంతకాలం తర్వాత మైథిలి నుంచి కాల్ వస్తుంది. తాను హైదరాబాద్ వస్తున్నానని చెబుతుంది. ఆమె కోసం ఫ్లాట్ సిద్ధం చేస్తాడు అన్వేష్. మైథిలి వస్తుంది. అతన్ని కలుస్తుంది. ఫ్లాట్‌కి తీసుకెళతాడు. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో మైథిలి మిస్ అవుతుంది. అసలు మైథిలి ఏమైంది? ఆమెను అన్వేష్ వెదికి పట్టుకున్నాడా? అసలు మైథిలి హైదరాబాద్‌కు ఎందుకు వచ్చింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఇటీవలి కాలంలో లవ్ స్టోరీస్ అనేవి తగ్గిపోయాయి. ఎందుకంటే లవ్ స్టోరీ అంటే ఏముంటుంది? హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ పుడుతుంది. ఆ తరువాత అవాంరాలు ఎదురవుతాయి. చివరకు ఇద్దరూ ఒక్కటవుతారు. అంతకు మించి పెద్దగా ఏమీ ఉండదు. కానీ దానిని ఎలా ప్రెజెంట్ చేశారనేదే ముఖ్యం. ‘రొమాంచకం’ విషయానికి వస్తే జెన్‌జీకి పండగ లాంటి సినిమా. ప్రస్తుతం జెన్‌జీ టైం నడుస్తోంది. వారిని ఆకర్షిస్తే చాలు.. సినిమా హిట్టే. మరి ఈ విషయాన్నిదృష్టిలో పెట్టుకున్నారో ఏమో కానీ దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కథను ఆసక్తికరంగా మలిచారు. జెన్‌జీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? వారు లైఫ్ గోల్స్‌ని ఎలా సెట్ చేసుకుంటున్నారు? ప్రేమ.. దానికి తగ్గట్టుగానే ఓ మెచ్యూరిటీ లెవల్స్‌ని సినిమాలో చక్కగా చూపించారు. ప్రస్తుత తరుణంలో జెన్‌జీ ఆలోచనా విధానం ఉద్యోగం కంటే ఏదో ఒకటి సాధించాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ కోసం హీరో పడే తపన.. చివరిలో అమ్మాయిని అర్థం చేసుకునే విధానం.. జెన్‌జీ మధ్య ఉండే ఫన్ అన్నింటినీ దర్శకుడు చక్కగా క్యాచ్ చేసినట్టుగా అనిపించింది. పెద్దలను అయితే అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు కానీ జెన్‌జీతో మాత్రం విజిల్స్ వేయిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ల పరిచయం.. హీరో ఏం చేయాలనుకుంటున్నాడు? దానికి అతను తన కెరీర్ గోల్స్‌ను ఎలా సెట్ చేసుకున్నాడనేది చూపిస్తే.. సెకండాఫ్‌లో ప్రేమ.. తన ప్రియురాలి కోసం హీరో పడే తపన.. ఆపై అమ్మాయిల మనస్థత్వాన్ని అర్థం చేసుకునే తీరు యూత్‌కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్‌కి మరి కాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది.
ఎవరెలా నటించారంటే..
సుమంత్ ప్రభాస్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. చాలా సన్నివేశాల్లో అతని నటన మెప్పిస్తుంది. అనంతిక కూడా చాలా అందంగా కనిపించింది. తన పాత్రను చక్కగా పోషించింది. వీరిద్దరి తర్వాత చెప్పుకోవల్సింది.. నరేంద్ర రవి గురించి. అతని కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అతను లేకుంటే కామెడీ అంతగా వర్కవుట్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది. ఇక ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు మ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం అన్ని బాధ్యతలను వేణుగోపాల్ రెడ్డి స్వీకరించారు. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. హీరోయిన్‌కు మరికాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది. మ్యూజిక్ మాత్రం వాసుకి వైభవ్ న్యాయం చేశారు. యూత్‌ని పాటలు బాగా ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. ‘రొమాంచకం’తో మిషన్ జెన్‌జీ సక్సెస్‌ఫుల్..