‘సహా’ సినిమా చూసి ఎవరైనా డిజప్పాయింట్ అయితే అమీర్‌పేట్ సెంటర్‌లో గుండు గీయించుకుంటానని హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో సినిమా బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. సినిమా ది బెస్ట్ లవ్ స్టోరీ అంటూ టాక్ నడిచింది. అంతేకాకుండా సినిమా ట్యాగ్‌లైన్.. ‘లైఫ్ ఆఫ్ సంజు’ కూడా చాలా ఆసక్తికరంగా ఉండటంతో అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా తెలుసుకుందాం.
కథేంటంటే..
స్కూలింగ్ సమయంలోనే సహా(శ్వేతా లక్ష్మణ్)ని సంజు ప్రేమించి.. ఆమె కోసం వేరే వాళ్ళతో గొడవలు పడతాడు. కొంత కాలం తర్వాత జరిగిన ఓ సంఘటనతో సహాకు సంజు (శివ కుమార్ కాసారం)పై ప్రేమ పుడుతుంది. కాలేజీ చదువు అయ్యాక ఇంట్లో వాళ్ళకు తమ ప్రేమ విషయం చెబుతారు కానీ వారు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిస్తూ ఉంటారు. సంజు.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పనిచేస్తుంటాడు. సహా ప్రగ్నెంట్ అయ్యాక ఆమెను తల్లిదండ్రులు ఆమెను దగ్గరకు తీస్తారు. అదే సమయంలో సంజు జాబ్ పోతుంది. సహా పుట్టింట్లో ఆమె ఇంటికి వచ్చేవాళ్ళు అంతా సంజు గురించి పలు రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దీంతో సంజు – సహా మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి? సంజుకి జాబ్ వచ్చిందా? సంజు – సహాల మధ్య వచ్చిన మనస్పర్థలతో వీరి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? ఈ అంశాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథను తీసుకెళుతూ కాస్త కన్ఫ్యూజన్‌ను క్రియేట్ అయితే చేశారు. సినిమా ఆరంభంలోనే ఓ 40 ఏళ్ళ వయసున్న సంజుని చూపించారు. అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పని చేస్తూ తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రతి పనిలోనూ భార్య జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తరువాత సినిమా గతంలోకి వెళుతుంది. స్కూల్ ఏజ్‌లో సహా వెనక సంజు పడటం, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు కొనసాగించాడు. అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో జరిగే కొన్ని సంఘటనలను చూపించారు. పెద్దగా హంగామా లేకుండా ఇంటర్వెల్‌తో ఫస్ట్ హాఫ్‌ను ముగించారు. సెకండాఫ్‌లో సంజు, సహాల పెళ్లి.. ఇద్దరూ ఆనందంగా జీవించడం.. సహ ప్రెగ్నెంట్ అవడం.. పుట్టింటికి వెళ్లడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. వాస్తవానికి ఇది మునుపెన్నడూ చూడని కొత్త కథేం కాదు. ఇలాంటి కథతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కాబట్టి సినిమాను ఎలా ప్రెజెంట్ చేశారన్నదే ముఖ్యం. చాలా చోట్ల సన్నివేశాలను సాగదీసి విసుగెత్తించారు. వెండితెరపై సినిమా చూస్తున్న ఫీలింగ్ కన్నా.. సాగదీసిన షార్ట్ ఫిలింను చూస్తున్నామన్న భావన కలుగుతుంది. చాలా సన్నివేశాలు వేరే సినిమాలను గుర్తుకుతెస్తాయి. కొత్తదనం కానీ.. ఆసక్తికరంగా కానీ సినిమా సాగకపోవడంతో ప్రేక్షకుడికి చూసే ఆసక్తి సన్నగిల్లుతుంది.
ఎవరెలా నటించారంటే..
శివ కుమార్ కాసారం పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయి. స్కూలింగ్, 40 ఏళ్ల వ్యక్తిగానూ కనిపిస్తారు. రెండు వేరియేషన్స్‌కు బాగానే న్యాయం చేశారు. శ్వేతా లక్ష్మణ్ కూడా సేమ్. తన పాత్రను చక్కగా నటించింది. ఎమోషన్ సన్నివేశాల్లో మెప్పించింది. ప్రజన కీలక పాత్రలో కనిపించి బాగానే మెప్పించింది. నటుడు హర్షవర్ధన్ కూడా చాలా బాగా నటించారు. ఆయన హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించారు. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు ఒక పాత కథను తీసుకుని పాత బాటిల్‌లో నింపి ఇవ్వడంతో అది చూసిన ప్రేక్షకులకు పాత సినిమాల మిక్సింగ్‌ను చూస్తున్న ఫీలింగే అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ చాలా పేలవంగా ఉంది. నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావాల్సినంతగా ఖర్చుపెట్టారు.
మొత్తంగా.. ‘సహా’ ప్రేక్షకుల సహనానికి పరీక్షే..