‘బన్ బటర్ జామ్’ రివ్యూ (Bun Butter Jam Review): న్యూ ఏజ్ ఫన్ రైడ్
మోడ్రన్ రిలేషన్షిప్స్, పేరెంట్స్ థాట్ ప్రాసెస్ మీద వచ్చిన సినిమా ‘బన్ బటర్ జామ్’. తమిళ్ బిగ్ బాస్ 5 విన్నర్ రాజు జేయమోహన్ హీరో. తెలుగులో ఆగస్టు 22న విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో సమీక్ష చదివి తెలుసుకోండి.
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 విన్నర్ రాజు జేయమోహన్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘బన్ బటర్ జామ్’. ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరోయిన్లు. రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ సుబ్రమణియన్ సమర్పణలో రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించారు. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్ సతీష్ కుమార్ ఆగస్టు 22న గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
కథ:
ఓ పెళ్లిలో తన జూనియర్ ఉమ (దేవదర్శిని)ని కుమార్ (చార్లీ) కలుస్తాడు. ఆ తర్వాత పిల్లల ప్రస్తావన వస్తుంది. తమ కొడుకు చంద్రు (రాజు జేయమోహన్) ఇంటర్ చదువుతున్నాడని కుమార్ భార్య లలిత (శరణ్య పొన్‌వన్), తమ కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్) సైతం ఇంటర్ అని ఉమ చెబుతారు. పిల్లలు ప్రేమలో పడేలా చేసి పెళ్లి చేయాలని తల్లులు ప్లాన్ చేస్తారు. అయితే కాలేజీలో నందిని (భవ్య త్రిఖ)ను ప్రేమిస్తాడు చంద్రు. మధుమిత సైతం మరొకరితో ప్రేమలో పడుతుంది. పేరెంట్స్ వేసిన ప్లాన్ ప్రకారం వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? లేదా? చివరకి ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు? అనేది సినిమా.
విశ్లేషణ:
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయినంత ఈజీగా, లైక్ కొట్టినంత ఈజీ ప్రేమలో పడుతోంది న్యూ జనరేషన్. అన్ ఫాలో కొట్టినంత ఈజీగా బ్రేకప్ చెబుతోంది. ప్రతి ఒక్కరూ అలా ఉండరని, జెన్యూన్ లవ్ ఉంటుందని చెప్పే చిత్రమిది. నిజాయతీగా ప్రేమించినా బ్రేకప్ అయితే ఆ బాధ నుంచి కోలుకోవాలని చెప్పే చిత్రమిది. మోడ్రన్ యూత్, ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్, లైక్స్, ఫాలోయింగ్ మాత్రమే జీవితం అనుకునే యువత తప్పకుండా చూడాల్సిన సినిమా ‘బన్ బటర్ జామ్’.
స్టార్టింగ్‌లో స్టోరీ సింపుల్‌గా కనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. ఎమోషనల్ డెప్త్ బావుంది. మెసేజ్ పేరుతో క్లాస్ పీకకుండా ప్రతి సన్నివేశంలో వినోదం ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ రాఘవ్ మిర్‌దత్. యూత్ ఎలా ఉన్నారు? ప్రేమలో ఎలా పడుతున్నారు? వంటివి కొత్తగా చూపించారు. అయితే మదర్ రోల్స్ సినిమాకు పూర్తిగా కొత్తదనం తీసుకు వచ్చాయి. ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం అంత ఈజీనా? అని క్వశ్చన్ చేసేలా ఉంది. అక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు డైరెక్టర్. కొన్ని సీన్లలో ఓవర్ ది బోర్డు వెళ్ళాడు. నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ కథకు ఫ్రెష్‌నెస్ తీసుకు వచ్చింది. బాబు కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్, తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బావుంది.
చంద్రు పాత్రలో రాజు జేయమోహన్ యాక్టింగ్ బావుంది. ఆయన ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్స్ సినిమాకు ఫ్రెష్‌నెస్ తీసుకు వచ్చింది. ఎమోషనల్ సీన్స్ బాగా చేశాడు. భవ్య త్రిఖ అందంగా కనిపించింది. అద్యప్రసాద్ నటనతో ఆకట్టుకుంది. స్నేహితుడిగా మైఖేల్, హీరో తండ్రిగా చార్లీ పాత్రలకు తగ్గట్టు నటించారు. శరణ్య, దేవదర్శిని అదరగొట్టారు.
తీర్పు:
న్యూ ఏజ్ రిలేషన్షిప్స్ మీద తీసిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బన్ బటర్ జామ్’. ప్రతి సీన్ ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతి సాంగ్ బావుంది. లీడ్ యాక్టర్లు రాజు జేయమోహన్, భవ్య త్రిఖ, ఆద్య ప్రసాద్ యాక్టింగ్ అదరగొట్టారు. మదర్ రోల్స్ చేసిన శరణ్య, దివ్యదర్శిని నవ్వించారు. వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి చూసే చిత్రమిది.