పరదా

Published by
Srinivas

పరదా రివ్యూ: ఆలోచనలు పుష్కలం… ఆచరణ శూన్యం!

అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో ‘శుభం’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన సినిమా ‘పరదా’. ఈ సినిమా ఎలా ఉంది? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

‘శుభం’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పరదా’. యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించారు. సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించగా… నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రత్యేక పాత్రలు పోషించారు. విమెన్ ఎంపవర్‌మెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ:

పడతి గ్రామంలో విచిత్రమైన కట్టుబాటు ఉంటుంది. ఈడొచ్చిన ఆడపిల్లలు తండ్రి లేదా భర్తకు తప్ప పరాయి పురుషుడికి ముఖం కనిపించకుండా పరదా ధరించాలి. ఒకవేళ గనుక పరదా లేకుండా కనిపిస్తే గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి చేసుకోవాలి. నిశ్చితార్థానికి సిద్ధమైన సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) తప్పు లేకుండా ముఖంపై పరదా తొలగుతుంది. ఊరి జనాలకు అది తెలిసి ఆమె ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయిస్తారు. తన తప్పు లేదని నిరూపించుకోవడానికి సుబ్బు తలపెట్టిన ప్రయత్నానికి మరో ఇద్దరు మహిళలు (సంగీత, దర్శన రాజేంద్రన్) సాయపడతారు. వాళ్లిద్దరూ ఎవరు? సుబ్బుకు ఎందుకు సాయం చేశారు? ఆఖరికి ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ:

కొన్ని కథలు బావుంటాయ్… బాగు అనేది ఆలోచన వరకు మాత్రమే. ఆ కథను ఆచరణలోకి తీసుకు వచ్చేసరికి తేడా కొట్టేస్తుంది. ‘పరదా’ ఆ బాపతులోకి వచ్చే సినిమా. ఆలోచనగా చూసినప్పుడు బావుండే కథ. మహిళ స్వేచ్ఛకు వేసిన పరదాను ఆలొగించాలని అనుకోవడం చక్కటి ఆలోచన. కానీ ఆచరణలో ఆ తొలగింపు కార్యక్రమం మెప్పించేలా లేదు. నత్తనడకన సాగింది. సమయం సందర్భం లేకుండా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అంటూ చెవులకు పట్టిన తప్పు వదిలేలా ఊదరగొట్టారు.

‘పరదా’ కథ ఎంతసేపటికీ ముందుకు కదలదు. ఊరిలో ఆడాళ్ళు పరదా ఎందుకు వేసుకుంటారనేది బుర్రకథ / ఉగ్గుకథలో చెప్పారు. అప్పట్నుంచి చివరి వరకు ప్రతి అంశంలో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. సుబ్బు కంటే పరదా లేకుండా పర పురుషులకు కనిపించిన కారణంగా ఊరిలో కొందరి ఆత్మాహుతి జరుగుతుంది. పరదా లేకుండా కనిపించడం వల్ల ఊరికి ఏర్పడిన అరిష్టాన్ని మాటల్లో చెప్పడం తప్ప తెరపైకి భావోద్వేగభరితంగా తీసుకురాలేదు. ఆత్మాహుతి దృశ్యాలు సైతం చూపించలేదు. అందువల్ల ముందు నుంచి సుబ్బు మరణం తథ్యమని మనకు అనిపించదు. తల్లిలేని పిల్ల తన తప్పు లేనప్పటికీ మరణిస్తుందని జాలి కలగదు. దాంతో ప్రతి సీన్ ల్యాగ్ చేసినట్టు ఉంటుంది.

విమెన్ ఎంపవర్‌మెంట్ అని డైలాగులు కొట్టడం తప్ప సీన్స్ చూస్తే అటువంటి ఫీలింగ్ ఉండదు. ఒక్క కథలో దురాచారాలు, ఉద్యోగంలో మహిళలు ఎదుర్కొనే వివక్ష, ఇంటిపనిలో గృహిణులు అనుభవించే ఒత్తిడి చెప్పాలని దర్శకుడు ప్రయత్నించి చివరకు దేనికీ న్యాయం చేయలేదు. కథలో బోలెడు విషయం ఉంది. కానీ దర్శకుడి టేకింగులో కంగాళీ ఎక్కువైంది. అందువల్ల ఎటువంటి ఫీలింగ్ ఇవ్వకుండా నిస్సారంగా ముందుకు సాగింది. చివరకు సుబ్బు తప్పు లేదన్నట్టు మమ అంటూ ముగించారు. విమెన్ ఎంపవర్‌మెంట్ థీమ్ పక్కనపెట్టి ఎటువంటి పాయింట్ లేకుండా క్లోజ్ చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. సాంగ్స్ ఓకే. ఆర్ఆర్ మాత్రం బాలేదు. ఒక్కటే థీమ్ మ్యూజిక్ రిపీట్ చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ ఏమంత గొప్పగా లేవు.

సుబ్బు పాత్రలో అనుపమ నటన బావుంది. పాత్ర నుంచి బయటకు రాలేదు. సీన్స్ నుంచి సపోర్ట్ లేకపోతే ఆవిడ మాత్రం ఏం చేయగలదు? దర్శన క్యారెక్టర్ సరిగా రాలేదు. నటనతో ఆవిడ కవర్ చేసింది. భర్తతో ఫోన్ మాట్లాడే సన్నివేశంలో సంగీత క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. గౌతమ్ మీనన్, రాజేంద్రప్రసాద్, రాగ్ మయూర్… ముగ్గురిని వాడుకోలేదు. హర్షవర్ధన్ తన పాత్రకు న్యాయం చేశారు.

తీర్పు:

విమెన్ ఎంపవర్‌మెంట్ మీద సినిమా తీయాలనే ఆలోచన బావుంది. కానీ ఆచరణ బాలేదు. శూన్య ప్రయోజనం. అసలు విషయం వదిలేసి కొసరు కథల్లోకి వెళ్లి మధ్య మధ్యలో పిట్టకథలు చెప్పింది బోర్ కొట్టించారు. థియేటర్లలో చివరి వరకు కూర్చోవడం కష్టం. వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026