ఐమ్ గేమ్

Published by
Srinivas

దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐమ్ గేమ్’ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి దుల్కర్ సల్మాన్ సినిమా వస్తోందంటేనే ఆసక్తి సర్వసాధారణంగానే పెరుగుతుంది. ఆయన ఎంచుకునే కథలే దానికి కారణం. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఐమ్ గేమ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో పెద్దగా ప్రచారం నిర్వహించకున్నా కూడా గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై సర్వసాధారణంగానే అంచనాలు పెరిగాయి. మరి సినిమా అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే…

డ్యాన్‌ జాన్‌ (దుల్కర్‌ సల్మాన్‌) సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. చదువు పూర్తి చేసి, తండ్రి కోరిక మేరకు బిజినెస్‌ చేస్తుంటాడు. అతనికి బిజినెస్ కన్నా.. గ్యాంబ్లింగ్‌ అంటేనే ఆసక్తి. రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నా జూదం వదలడు. దీంతో అప్పులపాలవుతాడు. అప్పుల వాళ్ల చేతిలో తన్నులు తినడంతో తల్లి మెర్సీ (జయసుధ) తాను దాచుకున్న రూ.60 లక్షలు డ్యాన్‌కు ఇస్తుంది. వాటిని కూడా తీసుకెళ్లి క్రికెట్‌ బెట్టింగ్‌లో పెట్టి పోగొడతాడు. ఆ తరువాత తను పెట్టిన డబ్బులు ఇచ్చేయమని బెట్టింగ్‌ నిర్వాహకులను బెదిరించి వాటిని తీసుకుని కారులో పారిపోతుండగా యాక్సిడెంట్‌ అవుతుంది. ఆ ప్రమాదంలో డ్యాన్ తన కుడిచేతిని కోల్పోతాడు. వైద్యులు ఆయనకు సర్జరీ చేసి వేరొకరి చేయిని అతికించడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. ఫిజియోథెరపీ చేయించుకుంటున్న తరుణంలో అతనికి ఇషా (కయాదు లోహర్‌) పరిచయమవుతుంది. అంతా బాగుందనుకునే సమయంలో డ్యాన్‌ కుడి చేయిపై కంట్రోల్ పోతుంది. ఎంత ప్రయత్నించినా సెట్ కాదు. కుడి చేయి తను చేయాలనుకుంటున్నవన్నీ చేసుకుంటూ పోతుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అసలు డ్యాన్‌కు అమర్చిన చేయి ఎవరిది? ఎందుకు అతని నియంత్రణలో లేకుండా పోతోంది? కుడిచేయి చంపేయాలనుకున్న డేవిడ్ ఎవరు? వంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే..

తమకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఆత్మలు ఒక వ్యక్తిని ఆవహించడం ఇప్పటి వరకూ చూశాం. కానీ చేయి వింతగా ప్రవర్తించడమనేది కాస్త కొత్తగానే అనిపిస్తుంది. వాస్తవానికి ఇలాంటి ఫిక్షనల్ వస్తూనే ఉంటాయి. కానీ లాజిక్‌ల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను మెప్పించగలిగితే సినిమా సక్సెస్ అయినట్టే. ‘ఐమ్‌ గేమ్‌’ విషయంలో దర్శకుడు నహాస్‌ హిదయత్‌ సరికొత్త కథనే ఎంచుకున్నాడు. కొంతమేర ఆసక్తికరంగానే తీసుకెళ్లాడు. కానీ ఆ తరువాతే అదుపు తప్పింది. ఈ సినిమా ప్రధానంగా డ్యాన్ పాత్ర ఆధారిత కథలా సాగుతుంది. మొత్తం కథనం అతను చేసే పనులు, వాటికి అతను ఇచ్చే ప్రతిస్పందనల చుట్టూనే తిరుగుతుంది. బలమైన కథే కానీ బలహీనమైన డ్రామా కారణంగా స్క్రీన్‌ప్లేలో చాలా సందర్భాల్లో భావోద్వేగం పెద్దగా కనిపించదు. డ్యాన్ ఒక విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన, బాధ్యతారహితమైన యువకుడు. తన తండ్రి (శ్యామ్‌ప్రసాద్) దృష్టిలో తాను “లూజర్” కాదని నిరూపించుకోవడమే అతని జీవిత లక్ష్యం. అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని చూస్తాడు. దానికోసం జూదం వైపు అడుగులు వేస్తాడు.
అయితే సినిమా క్రమంగా అతను నిజంగానే అనేక విధాలుగా “లూజర్” అని చెబుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో అతని లగ్జరీ లైఫ్ చూపించేందుకే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత అన్యాయానికి గురైన ఓ వ్యక్తి పట్ల డ్యాన్‌లో సానుభూతి ఎలా పెరుగుతుందో చూపించారు. కథనం ఒక్కసారిగా తన టోన్‌ను మార్చేసుకోవడంతో సినిమా రెండు పూర్తిగా భిన్నమైన భాగాలుగా విడిపోయిన భావన కలుగుతుంది. ఈ రెండు భాగాల మధ్య విజువల్, టోనల్ సంబంధం కూడా అంతగా కనిపించదు. ఇదే సినిమాలో పెద్ద మైనస్ అని చెప్పాలి.

ఎవరెలా చేశారంటే..

డ్యాన్‌ జాన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ జీవించాడు. ఆయన పాత్రలో రెండు వేరియేషన్స్ కనిపిస్తాయి. బాధ్యత లేని ఓ యువకుడిగా ఆరంభంలో.. ఆ తరువాత ఓ వ్యక్తికి జరిగిన అన్యాయం తెలుసుకుని పూర్తిగా మారిన తర్వాత మరో వేరియేషన్. ఒకానొక సందర్భంలో తన చేతితో తనే ఫైట్ చేస్తాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆంటోనీ వర్గీస్‌ సైతం బాగానే నటించాడు. మిస్కిన్‌ రొటీన్ విలన్‌గా కనిపించినా కూడా నటనతో మెప్పించాడు. కయాదు లోహర్‌, సంయుక్త విశ్వనాథన్‌ ఇద్దరూ బాగానే నటించారు.

టెక్నికల్‌గా..

సాంకేతికంగా సినిమా బాగుంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ వినూత్నమే. కానీ సినిమాను నడిపించే క్రమంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం సినిమాకు ప్లస్. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తవహిస్తే బాగుండేది. ముఖ్యంగా సెకండాఫ్ సాగదీసినట్టుగా అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. కొంతసేపు ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత అంతా రొటీన్

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

మహేంద్రగిరి వారాహి

సెప్టెంబర్ 15, 2026

ఎపిక్

సెప్టెంబర్ 11, 2026

సర్దార్ 2

సెప్టెంబర్ 11, 2026

మండాడి

సెప్టెంబర్ 11, 2026

మారెమ్మ

సెప్టెంబర్ 11, 2026

రంభ ఊర్వశి మేనక

సెప్టెంబర్ 4, 2026