హీరో సుమంత్ హడావుడిగా తన దగ్గరకు వచ్చిన ప్రతి కథతో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఏడాది మేలో ‘అనగనగా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అది ఓటీటీ వేదికగా మాత్రమే విడుదలైంది. ఈసారి ‘న్యూటన్స్ థర్డ్ లా’ చిత్రంతో వెండితెరపై మెరిశారు. టైటిల్.. క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్.. రెండూ ఆకట్టుకునేవే.. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
2026లో డేవిడ్ (అవసరాల శ్రీనివాస్) అనే వ్యక్తి తనకు పార్శిల్‌లో వచ్చిన ‘న్యూటన్స్ థర్డ్ లా’ అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తాడు. షాకింగ్‌గా అందులోని సంఘటనలు 1999లో జరిగిన తన గతానికి సంబంధించినవని డేవిడ్ తెలుసుకుంటాడు. ఆ పుస్తకంలో… జ్యోతి (నేహా పఠాన్) ప్రమాదవశాత్తూ మరణించడం.. అదే సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థి అయిన వినయ్ (త్రినాథ్ వర్మ) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ కేసును టేకప్ చేసి పోలీస్ అధికారి వాసుదేవ్ (సుమంత్) విచారణ నిమిత్తం రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా వినయ్ తల్లిదండ్రులు పార్వతి (షెల్లి ఎన్ కుమార్) – గంగాధర్ (రవివర్మ)లను విచారిస్తాడు. కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు వాళ్లేదో దాస్తున్నారన్న విషయం వాసుదేవ్‌కి అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే వినయ్ స్నేహితుడు కార్తీక్ (గౌతమ్ పండిట్) సడెన్‌గా మాయమవుతాడు. మరోవైపు పోస్ట్‌మార్టం నివేదికలో వినయ్‌ది ఆత్మహత్య కాదు.. ప్రి ప్లాన్డ్ మర్డర్ అని తెలుస్తుంది. అసలు వినయ్ ఎవరు? అతడిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? వినయ్ హత్యకు, జ్యోతి ప్రమాదంలో మరణించడానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ కథలో స్టీఫెన్ మెర్క్యురీ (జగపతిబాబు) పాత్ర ఏమిటి? అసలు ఆ పుస్తకాన్ని చదివి డేవిడ్ ఎందుకు భయపడ్డాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
చర్యకు ప్రతి చర్య సమానమనే ‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రకారం ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ కర్ణ తెరకెక్కించారు. న్యూటన్ చెప్పిన ఆ భౌతిక సూత్రాన్ని.. మానవ జీవితాల్లోని కర్మ సిద్ధాంతాన్నీ ముడిపెట్టడం ఆసక్తికరం. కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ దాన్ని తెరకెక్కించిన తీరే ఏమాత్రం బాగాలేదు. చాలా స్లోగా నడిపించారు. కన్ఫ్యజన్ చేశారు.. థ్రిల్లే లేకుండా చేశారు. 1999ల నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. వినయ్ ఆత్మహత్య, జ్యోతి ప్రమాదంలో కన్నుమూయడం.. ఈ రెండు ఘటనలకు కింక్ ఉందన్నట్టుగా ముందే హింట్ ఇచ్చేశారు దర్శకుడు. ఇక వాసుదేవ్ పాత్ర బాగుంది. కానీ ఆ పాత్రను నేరుగా ఇన్వెస్టిగేషన్ వైపు నడిపించడమే అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో మైనస్ ఏంటంటే.. ఇద్దరు మరణిస్తే.. ఇన్వెస్టిగేషన్ మాత్రం ఒకరి చుట్టూతే తిరగడం. మధ్యలో ఏదో అలా జ్యోతి కేసును టచ్ చేస్తారంతే. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా మరీ అంత ఆసక్తికరంగా ఏమీ అనిపించదు. ఫస్టాఫ్‌లో కేసును ఓ కొలిక్కి తెచ్చి ముగించినా కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మాత్రం ఇవ్వలేదు. ఇక ఆ తరువాత… మెర్క్యురి అనే పాత్ర ఎంట్రీ. మెర్క్యురీతో వినయ్‌కు సంబంధం ఏంటి? వంటివి చూపించారు. సెకండాఫ్ అంతా ల్యాగే. అసలు కొన్ని ప్రశ్నలకు దర్శకుడు ఆన్సరే చెప్పలేదు. క్లైమాక్స్‌లో చెబుతారులే అనుకుంటే గందరగోళం చేసి పడేశారు. అన్ని ట్విస్ట్‌లను ఒకేసారి రివీల్ చేసే క్రమంలో ప్రేక్షకులను పూర్తిగా కన్ఫ్యూజన్‌లో పెట్టారు. క్లైమాక్స్ కూడా ఏమాత్రం థ్రిల్ పంచలేకపోయింది. సినిమాతో ఒక మెసేజ్ కూడా ఇచ్చారు కానీ అది కూడా పెద్దగా ఆకట్టుకోదు. ముఖ్యంగా వాసుదేవ్ పాత్రకు సంబంధించి సరైన క్లారిటీ ఇవ్వడం కానీ.. ఆ పాత్ర ముగింపు సైతం ఆసక్తికరంగా లేదు. సుమంత్ ‘అనగనగా’ ఓటీటీలో వచ్చినప్పుడు అది వెండితెరపై వెలగాల్సిన చిత్రమని అంతా ప్రశంసలు కురిపించారు. ఈ కారణంగానేనేమో ఈ చిత్రాన్ని థియేటర్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం ఓటీటీ చిత్రమేనని చూసేవారికి అనిపిస్తుంది. వెండితెరకు అంతగా సూట్ కాదేమో అనిపించింది. మొత్తానికి ఎండింగ్‌లో గందరగోళాల నడుమ పార్ట్‌కి లీడ్ అయితే ఇచ్చారు.
ఎవరెలా నటించారంటే..
పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుమంత్ చక్కగా ఒదిగిపోయారు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన పాత్ర నిడివి మాత్రం తక్కువగా అనిపిస్తుంది. వినయ్‌గా త్రినాథ్ వర్మ తన నటనతో ఆకట్టుకున్నారు. గౌతమ్ పండిట్ సైతం అద్భుతంగా నటించారు. జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, షెల్లి, నేహా తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు రాజేశ్ కర్ణ తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ ప్రెజెంట్ చేసిన విధానమే అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ మూడ్‌కి తగ్గట్లుగా ఉన్నాయి. బీజీఎం పర్వాలేదనిపించినా.. పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఎడిటింగ్ విషయంలో కత్తెరకు బాగా పని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.
ఫైనల్‌గా.. ‘న్యూటన్స్ థర్డ్ లా’ థియేటర్ కన్నా ఓటీటీ కి వర్కవుట్ అవుతుంది.