శ్రీనివాస మంగాపురం

Published by
Srinivas

జై కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ మూడో తరం వారసుడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు స్వయానా అన్నకొడుకు. ఎలా చూసుకున్నా కూడా వాస్తవానికి జయకృష్ణ చిత్రానికి పెద్దగా ప్రమోషన్స్ అక్కర్లేదు. కానీ తన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో.. ప్రమోషన్స్ కోసం కూడా జై కృష్ణ అంతే కష్టపడ్డాడు. మార్నింగ్ టు ఈవినింగ్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాడు. ఎన్నో కాలేజ్‌లు, ఎన్నో పట్టణాలు తిరిగి సినిమాను జనాల్లోకి అయితే తీసుకెళ్లగలిగాడు. మరి వారి మనసులను తన సినిమాతో రంజింపచేయగలిగాడా? తెలుసుకుందాం.

కథేంటంటే..

తిరుపతిలో పెద్దిరెడ్డి(శ్యామ్‌)కి తిరుగుండదు. ఆయన పేరు వింటేనే జనాలు హడలెత్తిపోతారు. తేడా వస్తే ఎంతకైనా తెగిస్తాడు. తమ మనిషికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడన్న కారణంతో ఒక యువకుడిని చితకబాదుతారు. ఇది చూసిన శ్రీను(జై కృష్ణ) షాక్‌ అవడంతో పాటు.. పెద్ది రెడ్డి ఎలాంటి వ్యక్తో తెలుసుకుంటాడు. శ్రీవారి వేడుకలో పెద్దిరెడ్డి కూతురు మంగా(రాషా తడాని)ని శ్రీను చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి నిత్యం ఆమె వెంటపడుతుంటాడు. ఆమెని ప్రేమలో పడేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే అప్పటికే మంగకి పెళ్లి సెటిల్ అవుతుంది. అయినా కూడా ఆమెను వదలకుండా.. ఆమె పుట్టినరోజునాడు తిరుపతి సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. మంగ తిరస్కరిస్తుంది. మంగను శ్రీను ఇబ్బంది పెట్టడాన్ని చూసిన పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీతేజ్) అతనికి బుద్ధి చెప్పేందుకు యత్నిస్తాడు. ఆ సమయంలోనే ఓ గ్యాంగ్ వారిపై దాడి చేయడం.. దాని నుంచి సుబ్బారెడ్డిని శ్రీను రక్షించడం జరగుతాయి. దీంతో శ్రీనుని సుబ్బారెడ్డి వదిలేస్తాడు. తన తమ్ముడిని కాపాడిన శ్రీనుని పెద్దిరెడ్డి తన ఇంటికి పిలిపిస్తాడు. అసలు శ్రీను ఎవరు? పెద్దిరెడ్డి చెల్లి (వాసుకి) శ్రీనుని వాసుబాబు అని ఎందుకు పిలుస్తుంది? శ్రీను బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? తనను ప్రేమించమని ఎందుకు మంగ వెంట శ్రీను పడుతున్నాడు? ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్‌బాబు) పాత్ర ఏమిటి? వంటి అంశాల గురించి తెలియాలంటే వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..

ఈ చిత్రం రెడ్డి, నాయుడు అనే రెండు శక్తివంతమైన కుటుంబాల మధ్య సాగే ప్రేమకథగా దర్శకుడు అజయ్ భూపతి మలిచారు. రెండు పవర్‌ఫుల్ కుటుంబాలైన తిరుపతికి చెందిన పెద్దిరెడ్డి కుటుంబం, బళ్లారికి చెందిన ఫ్యాక్షన్ నాయకుడు వెంకటప్ప నాయుడు కుటుంబం మధ్య జరిగే సంఘటనలే కథకు ప్రధాన బలం. లవ్ స్టోరీకి ఓ రివెంజ్ డ్రామాను యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. కమర్షియల్ హంగులు తప్ప సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేమీ లేవు. సినిమా ప్రారంభంలో చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ సన్నివేశాలు.. అక్కర్లేని ఎపిసోడ్స్‌‌ను బలంగా ఇరికించడం వలన సినిమాపై పెద్దగా చూసే ప్రేక్షకుడికి ఆసక్తి కలగదు. కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్ విషయంలోనైనా అజయ్ భూపతి శ్రద్ధ వహించాల్సింది. అది కూడా స్ట్రాంగ్‌గా లేకపోవడంతో సినిమా తేలిపోయింది. సెకండ్ హాఫ్ కొంతమేర వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా మోహన్‌బాబు ఎంట్రీ తర్వాత సినిమా కొంత స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కానీ కథ విషయంలో పెద్దగా ఆసక్తి అయితే అనిపించదు. రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవలేదు. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్‌పై మాత్రమే ఫోకస్ పెట్టినట్టుగా అనిపించింది. కనీసం క్లైమాక్స్ కూడా బలంగా అనిపించదు. ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటుంది.

ఎవరెలా నటించారంటే..

హీరో జై కృష్ణ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. తొలి చిత్రమే అయినా కూడా ఎక్కడా తడబడినట్టుగా అనిపించలేదు. యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు. లుక్స్ పంగా పలు సన్నివేశాల్లో తన బాబాయి మహేశ్ బాబుని గుర్తు చేశాడు. రాషా తడాని సైతం చక్కగా నటించింది. నరేష్ పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక చాలా రోజుల తర్వాత మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు. శ్యామ్, శ్రీతేజ్, వాసుకి తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు అజయ్ భూపతి  కథ, స్క్రీన్‌ప్లేపై పట్టు బిగించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అనవసర ప్రయోగాలు ఎందుకులే అనుకున్నారో ఏమో కానీ సినిమాను రొటీన్ ఫార్మాట్‌లోనే తెరకెక్కించి ప్రేక్షకులను నిరుత్సాహపరిచారనే చెప్పాలి. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయి. జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘శ్రీనివాస మంగాపురం’ ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రొటీన్ ప్రేమకథ

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026