కొరియన్ కనకరాజు

Published by
Srinivas

‘కొరియన్ కనకరాజు’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటం.. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పడంతో పాటు.. ప్రమోషన్స్‌ను పీక్స్ కి తీసుకెళ్లడంతో కొరియన్ కనకరాజు మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులను అందుకున్న వరుణ్ తేజ్ సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. పైగా టైట్ స్క్రీన్‌ప్లేతో నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రమని వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో సైతం చెప్పారు. దీంతో సినిమాపై క్యూరియాసిటి పెరిగింది. మరి ఇన్ని అంచనాల నడుమ విడుదలైన సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..

చెక్కభజన మునిస్వామి (చిన్నా) కొడుకు కనకరాజు (వరుణ్ తేజ్). ఎంత మంచి వ్యక్తో కోపం వస్తే అంత దారుణంగా మారిపోతూ ఉంటాడు. అతని అన్న (అవసరాల శ్రీనివాస్) ఏదో బిజినెస్ చేస్తానంటూ ఇల్లు తాకట్టు పెట్టించి మరీ డబ్బు తీసుకుని సింగపూర్ వెళతాడు. కనకరాజు మాత్రం తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటాడు. నిత్యం తన స్నేహితుడు ఫోటోగ్రాఫర్ కిష్టప్ప (సత్య)తో కలిసి మందు తాగుతూ సరదాగా కాలం గడిపేస్తూ ఉంటాడు. అతనికి ఒకరోజు చైత్ర (రితికా నాయక్) కనిపిస్తుంది. చూడగానే ప్రేమలో పడతాడు. చైత్రకు ఎలాగైనా కొరియా వెళ్లి అక్కడే ఓ యువకుడిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే చైత్రకు కనకరాజు, కిష్టప్పలతో స్నేహం ఏర్పడుతుంది. సడెన్‌గా ఒకరోజు కనకరాజు చాలా వైలెంట్‌గా మారిపోతాడు. తనను కొట్టడానికి వచ్చిన నల్ల శీనును దారుణంగా మెడ విరిచి చంపేస్తాడు. అలాగే తనను చంపేయబోయిన చెంగారెడ్డి (సునీల్) మనుషులను సైతం చంపేస్తాడు. అసలు చెంగారెడ్డి ఎవరు? సడెన్‌గా కనకరాజు మారిపోవడానికి కారణమేంటి? ఎందుకు కనకరాజు కొరియాకు వెళ్లాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

పెద్దగా సాగదీతలు లేకుండా దర్శకుడు నేరుగా కథలోకి అయితే తీసుకెళ్లాడు. వాస్తవానికి వరుణ్ తేజ్ కూడా సినిమా కథ కంటే ఇదొక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపించేశారు. వాస్తవానికి సినిమా ఆరంభం నుంచి కామెడీ బాగా వర్కవుట్ అయ్యుంటే బాగుండేది. ఇంటర్వెల్‌కు కాస్త ముందు నుంచి కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. సినిమా మొత్తంలో శ్మశానం ఎపిసోడ్ హిలేరియస్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే కనకరాజు, కిష్టప్ప, చైత్ర కొరియాకు వెళ్లడం అక్కడ జరిగే హంగమాతో నడిపించారు. సెకండాఫ్‌లో సైతం కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. అయితే ఏదో పక్క ఊరికి వెళ్లినట్టుగా హీరోహీరోయిన్‌లు కమెడియన్స్ కొరియాకు వెళ్లడం చాలా అసహజంగా అనిపిస్తుంది. వరుణ్ తేజ్ చెప్పినట్టుగా స్క్రీన్‌ప్లే అంత టైట్‌గా ఏమీ లేదు. కొన్ని చోట్ల కథ నెమ్మదించిన ఫీల్ కలుగుతుంది. కొరియా చుట్టూ మరికాస్త స్ట్రాంగ్‌గా కథ అల్లి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా కూడా సినిమాను అక్కడక్కడ బాగానే ఎంజాయ్ చేస్తారు. కాన్సెప్ట్ కూడా కొత్తదే కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. వరుణ్ తేజ్‌కు చాలా కాలం తర్వాత ఈ సినిమా సక్సెస్‌ను అందిస్తుందనడంలో సందేహం లేదు.

ఎవరెలా నటించారంటే..

వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడు. రెండు పాత్రలను హ్యాండిల్ చేసిన తీరు, ఆ పాత్రల్లో వేరియేషన్ చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆత్మ శరీరంలోకి వచ్చిన తర్వాత చేసే బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. రాయలసీమ యాసను కూడా చాలా సహజంగా మాట్లాడినట్టుగా అనిపించింది. కామెడీ విషయంలోనూ ఏమాత్రం తగ్గలేదు. ఇక సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సత్య కాకుండా వేరే ఎవరున్నా కూడా సినిమా ఎలా ఉండేదో. సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సత్య నే సినిమాకి సెకండ్ హీరో. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఎక్స్‌ప్రెషన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. వరుణ్ తేజ్, సత్య కాంబో సినిమాకు బిగ్ ఎసెట్. ఇక రితిక విషయానికి వస్తే ఆమె కూడా చాలా బాగా నటించింది. ప్రతి సన్నివేశంలోనూ తన నటనలో మెచ్యూరిటీని కనబరిచింది. చాలా కాలం తరవాత చిన్నా వెండితెరపై కనిపించి మెప్పించారు. సునీల్ ఆ పాత్ర ఎందుకు చేశారో కూడా తెలియదు. ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. అసలు ఆ పాత్రను దర్శకుడు బలవంతంగా ఇరికించాడేమో అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో కనిపించారు. ద‌క్ష న‌గార్క‌ర్ రాస గుమ్మ‌డి పాట‌లో మెరిసింది. ఈ సినిమాలో పెద్ద రిలీఫ్ సత్య – మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే సన్నివేశాలు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు మేర్లపాక గాంధీ సినిమా పైన మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీ అయితే తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పైన మరింత శ్రద్ధం పెట్టి ఉంటే బాగుండేది. కొరియన్ ఎపిసోడ్ మరియు వరుణ్ తేజ్ కొరియన్ ఆత్మగా మారినప్పుడు బీజీఎం బాగుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది.

ఫైనల్‌గా.. వరుణ్ తేజ్ థియేటర్లో ప్రేక్షకులను నవ్విస్తాడు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026