నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’. ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. సెన్సార్ బోర్డు ఈ సినిమాను 8 నెలల పాటు హోల్డ్ చేసింది. మొదట ‘చైనా పీస్’గా ఉన్న టైటిల్‌ను మార్పించేసి చివరకు పర్మిషన్ ఇచ్చింది. అసలు ఈ సినిమాలో 8 నెలల పాటు హోల్డ్ చేయాల్సినంత ఏముందనేది ఆక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.
కథేంటంటే..
నెల్లూరుకు చెందిన మీరా వలి (నిహాల్ కోదాటి ) పృథ్వీ (సూర్య శ్రీనివాస్) మంచి స్నేహితులు. మీరావలికి దేశభక్తి ఎక్కువ. ఎప్పటికైనా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటాడు. దానికోసం రకరకాలుగా ప్రయత్నాలు సాగిస్తుంటాడు. పృథ్వీ కూడా వలిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే వలి కల నెరవేరకపోగా.. అతను అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవడంతో ఉగ్రవాదిగా ముద్ర పడుతుంది. దీంతో వలికి దేశభక్తిని నిరూపించుకునే అవకాశం వస్తుంది. దీనికోసం అతను గూఢచారిగా మారుతాడు. ఈ క్రమంలోనే వలి దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన ఓ సీక్రెట్ డిఫెన్స్ లీక్ మిషన్‌లో వలి భాగస్వామి అవుతాడు. అసలు వలిపై ఉగ్రవాదిగా ముద్ర ఎలా పడుతుంది? ఆ కీలకమైన మిషన్ ఏంటి? ఆ మిషన్‌లో వలి ఎదుర్కొన్న సమస్యలేంటి? వలి గూఢచారి అన్న విషయం పృథ్వీకి ఎప్పుడు ఎలా తెలిసింది? దేశం కోసం వలి ఏం చేశాడు? మిషన్‌లో బయటపడే రహస్యాలు.. పృథ్వీని వెంటాడిన శత్రువులు ఎవరు? వంటి విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే…
స్నేహం, దేశభక్తి కలయిలో రూపొందిన చిత్రమిది. రెండు అంశాలూ కీలకమైనవే. వర్కవుట్ అయితే సినిమాకు తిరుగుండదు. ఈ సినిమాలో మరో కీలక విషయం.. ఓ కీలకమైన మిషన్‌కీ, నెల్లూరుకు చెందిన ఇద్దరు కుర్రాళ్లకీ మధ్య సంబంధం ఏంటనేది. స్పై డ్రామా సినిమాల్లో కనిపించే హంగులు.. ఆర్భాటాలూ అయితే ఈ సినిమాలో కనిపించవు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం.. ఇద్దరు స్నేహితులు.. వారి విభిన్న ఆలోచనలు.. నేపథ్యాలను చూపిస్తూ చాలా స్లోగా కథను నడిపించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో మాత్రం కథలో వేగం పెంచాడు దర్శకుడు. ఎలాంటి ట్విస్ట్‌లకు తావు లేకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లాడు. కథలోని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఒక మైండ్ గేమ్‌ని తలపిస్తాయి. అయితే, ఆ డిఫెన్స్ లీక్ వెనుక ఉన్న గూఢచార వ్యవస్థల నెట్‌వర్క్‌ని మాత్రం అంత లోతుగా దర్శకుడు చూపించకపోవడం పెద్ద మైనస్. అలాగే గూఢచర్యం చేసే వలి.. శత్రువుల చేతిలో పావులా కనిపిస్తూ ఉంటాడు. కనీసం సొంతంగా తెగువ, సాహసాలు చూపించడం వంటివి మనం చూడలేం. ఇదో మైనస్. ఇక దేశానికి సంబంధించిన సున్నితమైన సన్నివేశాలను సైతం ఆకట్టుకునేలా దర్శకుడు చూపించలేకపోయారు. అవన్నీ మనకు సినిమాటిక్‌గా మాతరమే అనిపిస్తాయి. మొత్తానికి పేరుకే ఇదొక స్పై డ్రామా.. పేరులోని సీరియస్‌నెస్ సన్నివేశాల్లో ఎక్కడా కనిపించదు. దీంతో సినిమా అంతగా మెప్పించలేకపోయింది.
ఎవరెలా నటించారంటే…
నిహాల్ కోదాటి తన పాత్రలో ఒదిగిపోయాడు. డబ్బున్న యువకుడిగానే కాకుండా దేశభక్తి మెండుగా ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. సూర్య శ్రీనివాస్ సైతం అద్భుతంగా నటించాడు. నెల్లూరు యాసలో చక్కగా మాట్లాడాడు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. కమల్ కామరాజు, రంగస్థలం మహేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబును తీసుకున్నా కూడా వారిని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయారు.
టెక్నికల్ పరంగా..
దేశభక్తి సంబంధిత సన్నివేశాలు సినిమాటిక్‌గా తెరకెక్కించి తన సినిమాను తనే దెబ్బతీసుకున్నాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాల్లో లోతుగా చూపించకపోవడం కూడా సినిమాకు ఇబ్బందికరంగా మారింది. మంచి లైన్ ఎంచుకున్నా కథను ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డారు. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. నిడివి తక్కువే అయినా కూడా ఇంకా ఎడిటింగ్‌పై ఫోకస్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా.. మెప్పించలేకపోయిన దేశభక్తి డ్రామా..