90s వెబ్‌సిరీస్ తర్వాత దర్శకుడు ఆదిత్య హాసన్‌పై ఒక మంచి అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఆయన తెరకెక్కించిన ‘ఎపిక్’ చిత్రంపై అంచనాలు సైతం భారీగానే ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట ఇప్పటికే ఒకసారి జంటగా వచ్చి వెండితెరపై మ్యాజిక్ చేశారు. తిరిగి ఇన్నాళ్లకు అదే జంట ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
‘#90స్’ కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) కథే ఈ సినిమా. సినిమా దర్శకుడు కావాలనేది అతని కల. అతని తల్లిదండ్రులు (వాసుకి, శివాజీ)కు తమ కొడుకు బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని కోరిక. ఒక రోజు తెలిసిన వ్యక్తి ఇచ్చిన సలహాతో ఆదిత్యను యూఎస్ లేదంటే యూకే పంపాలనుకుంటారు. మొదట ఆదిత్య అంగీకరించడు కానీ ఆ తరువాత ఒప్పుకుని యూకే వెళతాడు. లండన్‌లో చదువు పూర్తైన వెంటనే వచ్చేసి డైరెక్టర్ అవ్వాలనే ఆలోచనతో ఉంటాడు. ఆదిత్య చేరిన యనిర్సిటీలోనే తెలుగమ్మాయైన కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. ఆదిత్యకు ఏమాత్రం ఇంగ్లీష్ రాకపోవడంతో కడలి సాయం చేస్తుంద. అలా తొలి రోజే ఒకరికొకరు దగ్గరవుతారు. ఆ తర్వాత రూమ్ షేర్ చేసుకుందామని కడలి చెప్పడంతో ఆదిత్య ఓకే అంటాడు. అతని రూమ్‌కి కడలి షిఫ్ట్ అవుతుంది. ఆ తరువాత ఇద్దరూ సహజీవనం చేస్తారు. ప్రేమ, పెళ్లి వంటివేం వద్దని.. ఉన్నంతకాలం కలిసి ఉండి తర్వాత ఎవరి దారి వాళ్లం చూసుకుందామని చెబుతుంది. ఆదిత్య కూడా అంగీకరిస్తాడు. ఆ తరువాత వారిద్దరి రిలేషన్ ఏమైంది? ఆదిత్య డైరెక్టర్ అయ్యాడా? ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాల్ని తీసుకున్నాడు? వంటి విషయాలను వెండితెరపై వీక్షించాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే..
‘#90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ప్రపంచం నుంచే కథను ప్రారంభించిన దర్శకుడు మిడిల్ క్లాస్ కష్టాల్ని పరిచయం చేస్తూ ఆదిత్య కథలోకి తీసుకెళ్లాడు. ఆదిత్య లండన్ వెళ్లాకే అసలు కథ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం యూత్ నడవడిక ఎలా ఉందనే దానికి ఈ సినిమా అద్దం పడుతుంది. యూత్ లైఫ్ స్టైల్, డేటింగ్, లివింగ్ రిలేషన్ షిప్స్.. ఆ తరువాతి పరిణామాలను చూపించారు. వాస్తవానికి సినిమా మొత్తం ఆదిత్య, కడలిపైనే నడిపించారు. చదువుల కోసమని లండన్ వెళ్లిన ఇద్దరు యువతీయువకుల ప్రయాణం. చదువు కోసం వేరే దేశానికి వెళ్లిన యువత ఇంత దారుణంగా ఉంటారా? అనిపిస్తుంది చూసే పెద్దవాళ్లకైతే.. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా దర్శకుడు ఆదిత్య హాసన్ కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. అందుకే ఈ సినిమాలో ట్విస్ట్‌లు, టర్న్‌లు, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్, హ్యాపీ ఎండింగ్ వంటివేమీ కనిపించవు. సాగదీత తప్ప మనకైతే ఏమీ కనిపించదు. జంట.. వారి మధ్య జరిగే అన్ని వ్యవహారాలనూ దర్శకుడు చూపించారు. యువతను ఇంత అప్‌డేటెడ్‌గా చూపించి కులాల పట్టింపు తీసుకురావడమే ఒకింత ఆసక్తికరం. ప్రస్తుత తరుణంలో కులమతాలు ఎక్కడో కానీ పట్టించుకోవడం లేదు. అసలు ముందుగా ఈ వ్యవహారాలన్నీ ఉంటే యూత్ వర్షన్ వేరేలా ఉంటోంది. దర్శకుడు ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేదో తెలియలేదు. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం.. అమ్మాయిలకు ఇంటి నుంచి ఎదుయ్యే సమస్యలను చూపించారు. సెకండాఫ్‌లో అబ్బాయిల, అమ్మాయిల 24 ఏళ్లు ఒకటి కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. అమ్మాయిలకు పిరియడ్స్ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్, ఇబ్బందులు వంటివన్నీ చర్చించారు. ఎందుకో ఆదిత్యను ఏమీ తెలియని అమాయకుడిలా చూపించారు. ఈ సినిమాను పిల్లలతో కలిసి చూడటం కష్టమే. అందుకే దీనికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం 20 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఏమైనా నచ్చుతుందేమో కానీ పెద్దలకు కనెక్ట్ అవడం కష్టమే. పార్ట్ 2కి లీడ్ ఇచ్చి సినిమాను ముగించారు.
ఎవరెలా నటించారంటే..
ఆదిత్య పాత్రలో ఆనంద్ దేవరకొండ జీవించాడు. అయితే అతని పాత్రను డిజైన్ చేసిన విధానం అందరికీ నచ్చకపోవచ్చు. చాలా అమాయకుడిలా.. ఒకరకంగా చెప్పాలంటే దద్దీలా అనిపిస్తుంది. యూత్ ఇవాళ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇక కడలి పాత్రలో వైష్ణవి అద్భుతంగా నటించింది. చాలా అందంగా కూడా కనిపించింది. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. హీరో తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి పాత్రలు సినిమాకి కీలకం. వీరి పాత్రల నిడివి తక్కువే అయినా కూడా సినిమాపై బలమైన ప్రభావం చూపిస్తాయి. ఇద్దరూ చాలా బాగా నటించారు దర్శకుడు కళ్యాణ్ శంకర్ హీరో స్నేహితుడైన సింజిత్ పాత్రలో కనిపించి మెప్పించారు. మనోజ్‌పాత్రలో శ్రీనివాస్ గవిరెడ్డి కూడా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు ఆదిత్య హాసన్.. సినిమాను కేవలం ఇద్దరి ప్రయాణంగా మాత్రమే చూపించారు. అసంపూర్ణంగా ముగించడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. కథను నడిపించిన తీరే మైనస్‌గా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం పార్ట్ 1ని బలి చేశారేమో అనిపించింది. హేషమ్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. అజీమ్ మహమ్మద్ విజువల్ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ విషయంలోనూ శ్రద్ధ పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. యూత్‌కి ఇష్టం.. పెద్దలకు కష్టం