ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

Published by
Srinivas

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show) రివ్యూ: మన మట్టి కథ – స్వచ్ఛమైన హాస్యం

తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మాస్టర్ రోహన్ రాయ్ కీలక పాత్ర చేయగా… టీనా శ్రావ్య కథానాయికగా నటించింది.

తిరువీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఆయన సరసన కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య నాయికగా నటించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్టర్ రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్టెయిర్ వినయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాంక్ బాషా ఇతర ప్రధాన తారాగణం. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకోండి. 

కథ:

పల్లెటూరులో‌ రమేష్ (తిరువీర్)ది ఫోటో స్టూడియో కమ్ జిరాక్స్ సెంటర్. దానికి ఎదురుగా ఉన్న పంచాయితీ ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగి హేమ (టీనా శ్రావ్య)పై మనసు పడతాడు. తన ప్రేమ విషయాన్ని చెప్పడు. అమ్మాయి మనసులోనూ అతడు అంటే ప్రేమ. సాఫీగా సాగిపోతున్న వీళ్ళ ప్రయాణంలో ఆనంద్ (నరేంద్ర రవి) రాక టెన్షన్ పెడుతుంది. 

మండలంలో ది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ తనదే అవ్వాలని రమేష్ దగ్గరకు వస్తాడు ఆనంద్. అతనికి రాజకీయ పలుకుబడి ఉంది. డబ్బులు కూడా ఖర్చు పెడతాడు. షూటింగ్ అంతా చేశాక అది సేవ్ అయిన మెమరీ కార్డును రమేష్ అసిస్టెంట్ రామ్ (మాస్టర్ రోహన్ రాయ్) పోగొడతాడు. ఆ తర్వాత ఏమైంది? దానివల్ల రమేష్ – హేమ ఏం చేశారు? అసలు విషయం ఆనంద్ చెవిన పడిందా? చివరకు ఆ మెమరీ కార్డు దొరికిందా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

వెస్ట్రన్ కల్చర్ ప్రభావం పెరిగిన తర్వాత మన తెలుగు సినిమా కథల్లోనూ మార్పులు వచ్చాయి. పాన్ ఇండియా కల్చర్ మధ్యలోనూ మట్టి నుంచి పుట్టిన కథలు వస్తున్నాయి. అటువంటి చిత్రమే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది లార్జర్ దేన్ లైఫ్ కథ కాదు. పల్లెల్లో కనిపించే జీవితం.

కథ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ నిజాయతీగా చెప్పాడు. కథలో నిజాయతీకి చోటు ఇచ్చాడు. సాదాసీదాగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ మొదలైంది. హీరోకి ఎదురైన సమస్య కథపై ఆసక్తి ఎటువంటి కలిగించలేదు. సమస్య నుంచి గట్టెక్కడం కోసం హీరో చేసే ప్రయత్నాలు సైతం గొప్పగా లేవు.

ఎదుటి వ్యక్తి జీవితం ఏమైనా పర్వాలేదని, తన సమస్య పరిష్కారం అయితే చాలన్నట్టు హీరో చూడటం రుచించదు. ఒక సందర్భం తర్వాత హీరోలో వచ్చే మార్పు, కథలో నిజాయతీకి దర్శకుడు కల్పించిన చోటు సినిమా స్వరూపాన్ని మార్చింది. అక్కడి నుంచి వినోదం, భావోద్వేగం పండాయి. ప్రథమార్థం సాదాసీదాగా సాగితే ద్వితీయార్థం కట్టిపడేస్తుంది. పతాక సన్నివేశం చిన్న చిరునవ్వు పూయిస్తుంది.

సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు ఊపిరి పోసింది. కథలో ఆత్మను తెరపై చాలా చక్కగా ఆవిష్కరించడమే కాదు… పల్లె వాతావరణంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్ళింది. కెమెరా వర్క్ నీట్‌గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సింపుల్ కథ కావడం, లీనియర్ స్క్రీన్ ప్లే ఉండటం వల్ల సినిమాలో ట్విస్టులు ఉండవు.

పల్లెటూరి కథల్లోనూ ఎలివేషన్స్ కోరుకునే హీరోలు ఉన్న రోజుల్లో క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించినందుకు హీరో తీరువీర్‌ను అభినందించాలి. ఎమోషన్స్ అన్నీ చక్కగా చూపించారు. సహజంగా కనిపించారు. నరేంద్ర రవి నటన, వినోదానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రత్యేకమైన లవ్ ట్రాక్ లేదు. పరిమిత పాత్రలో చక్కటి నటన కనబరిచింది టీనా శ్రావ్య. మాస్టర్ రోహన్ రాయ్ నవ్విస్తాడు.   

తీర్పు:

పల్లె దాటని కథ, పట్నం వాసన ఎరుగని సంగీతం, స్వచ్ఛమైన హాస్యం, అచ్చమైన నటన కలబోత ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. వినోదం కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్ జోలికి వెళ్లకుండా కుటుంబమంతా కలిసి చూసేలా తీశారు. హాయిగా నవ్వుకునే చిత్రమిది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

మహేంద్రగిరి వారాహి

సెప్టెంబర్ 15, 2026

ఎపిక్

సెప్టెంబర్ 11, 2026

సర్దార్ 2

సెప్టెంబర్ 11, 2026

మండాడి

సెప్టెంబర్ 11, 2026

మారెమ్మ

సెప్టెంబర్ 11, 2026

రంభ ఊర్వశి మేనక

సెప్టెంబర్ 4, 2026