పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా రివ్యూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దే కాల్ హిమ్ ఓజీ’. డివివి దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన చిత్రమిది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఓజీ సమీక్షలో చిత్రం గురించి తెలుసుకోండి.
‘ఖుషి’ తర్వాత అభిమానుల్లో ఇటువంటి జోష్ చూస్తున్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రేడ్ వర్గాలు సైతం థియేటర్స్ దగ్గర ‘ఓజీ’ టికెట్స్ సేల్స్ చూసి షాక్ అయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత క్రేజ్ సొంతం చేసుకున్న చిత్రమిది. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాల నడుమ ‘ఓజీ’ విడుదలైంది. ఫ్యాన్ బాయ్ సుజీత్ తీసిన సినిమా ఎలా ఉంది? ముంబై అండర్ వరల్డ్, మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలో అభిమానులు, ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏమున్నాయి? వాళ్ళు మెచ్చేది ఏమిటి? వాళ్ళకు నచ్చనది ఏమిటి? అనేది సమీక్షలో తెలుసుకోండి.
కథ:
జపాన్‌లో బలపడిన యాకూజా గ్యాంగ్‌స్టర్స్‌ను అంతం చేయడానికి ఓ గురువు సీక్రెట్‌గా సమురాయ్‌లను సిద్ధం చేస్తుంటాడు. వారిలో గంభీర (పవన్ కల్యాణ్) ఒకడు. ఆ సీక్రెట్ సమురాయ్ క్యాంపు గురించి తెలిసి యాకూజాలు ఎటాక్ చేస్తాయి. దాన్నుంచి గంభీర తప్పించుకుంటాడు. ఇండియా బయలుదేరిన షిప్ ఎక్కుతాడు. అందులో సత్య దాదా (ప్రకాష్ రాజ్), మిరాజ్కర్ (తేజ్ సప్రు) ఉంటారు.
సత్య దాదా దగ్గరున్న బంగారాన్ని బందిపోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తే గంభీర కాపాడతాడు. ఆ క్రమంలో సత్య దాదా ఆలోచనలు నచ్చి అతడికి అండగా నిలబడతాడు. గంభీర అండతో ముంబైలోని కొలాబా ప్రాంతంలో పోర్టు నిర్మించి ప్రజలకు ఉపాధి కల్పిస్తాడు సత్య దాదా.
గంభీర ఉండగా సత్య దాదాను ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రీ కొడుకుల వలే మెలిగే సత్య దాదా, గంభీర మధ్య ఎందుకు దూరం పెరిగింది? ముంబై వదిలి పదిహేనేళ్లుగా వేరే ప్రాంతంలో గంభీర ఎందుకు ఉంటున్నాడు? మిరాజ్కర్ చిన్న కొడుకు జిమ్మీ (సుదేవ్ నాయర్) వల్ల సత్య దాదా కుటుంబానికి జరిగిన నష్టం ఏమిటి? పెద్ద కొడుకు ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నుంచి ముంబైను, సత్య దాదా కుటుంబాన్ని ఓజీ ఎలా కాపాడాడు? అనేది సినిమా.
విశ్లేషణ:
పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ – థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి అభిమాని మదిలో వినిపించే మాట. అలాంటోడు మళ్ళీ తిరిగొచ్చాడు చూడండ్రా అని గట్టిగా అరవాలనిపిస్తుంది. తరాలు మారినా తరగని స్వాగ్, స్టైల్ తమ హీరో సొంతం అని పవన్ కల్యాణ్ అభిమానుల ముఖాల్లో చిరునవ్వు వికసిస్తుంది.
అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే – ఓజీ ప్రచార చిత్రంలో వినిపించిన ఈ మాట ప్రతి అభిమాని మనసులో బలంగా నాటుకుంది. సుజీత్ సైతం పవన్ అభిమానే కదా! తమ అభిమాన కథానాయకుడిని మళ్ళీ తెరపైకి తీసుకు రావాలనే తాపత్రయం ప్రతి సన్నివేశంలో కనిపించింది. పవన్ అంటే స్టైల్, పవన్ అంటే స్వాగ్, పవన్ అంటే యాక్షన్, పవన్ అంటే ట్రెండ్ సెట్టర్. తెలుగు తెరకు పవన్ పరిచయం చేసిన స్టైల్స్, మ్యూజిక్, యాక్షన్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్. అటువంటి పవన్ మళ్ళీ ‘ఓజీ’లో కనిపించారు. కథతో సంబంధం లేకుండా పవన్ తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుడు ఆయన స్టైల్, స్వాగ్, యాక్షన్ చూసి మెస్మరైజ్ అయ్యేలా ఈ సినిమా తెరకెక్కించారు సుజీత్.
‘ఓజీ’లో పవన్ అభిమానులు కోరుకునే, వాళ్ళకు కావాల్సిన విజిల్ వర్తీ మూమెంట్స్ ఫుల్లుగా ఉన్నాయి. పవన్ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ అన్నట్టు ఎలివేషన్ ఇచ్చాడు సుజీత్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నభూతో న భవిష్యత్. ఇంటర్వెల్ అయ్యాక వచ్చే అరగంట థియేటర్లు దద్దరిల్లే స్టఫ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ ముందు, తర్వాత భారీ యాక్షన్ సీన్లు బాగా తీసిన సుజీత్… ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ, సెకండాఫ్‌లో పవన్ – ప్రకాష్ రాజ్ బాండింగ్ బలంగా ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యేలా చెప్పలేదు. అందువల్ల మాంచి హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఫస్టాఫ్‌లో కాసేపు డల్ అయినట్టు అనిపిస్తే ఫెంటాస్టిక్ సెకండాఫ్ స్టార్ట్ తర్వాత కొంచెం సేపు డల్ అవుతుంది. ఒకందుకు అదీ మంచిదే అనిపిస్తుంది. కొంచెం స్లో అయిన సినిమాను తర్వాత భారీ యాక్షన్ సీన్లు బీభత్సంగా ఎలివేట్ చేశాయి.
టెక్నికల్ పరంగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెంచిన సినిమాగా ‘ఓజీ’ నిలుస్తుంది. తమన్ మ్యూజిక్ ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి పాటలో ఫెంటాస్టిక్. సినిమా డల్ అవుతుందేమో అని సందేహం కలిగిన ప్రతి చోట సంగీతంతో నిలబెట్టాడు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. హాలీవుడ్ స్టైల్ విజువల్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా, షార్ప్‌గా ఉంది. యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన దర్శకుడు, కొరియోగ్రఫీ చేసిన మాస్టర్లను స్పెషల్‌గా అప్రిషియేట్ చేయాలి. పవన్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ బావున్నాయి.
‘ఓజీ’ అంతా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో నడిచింది. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సన్నివేశంలో మిగతా అందరినీ డామినేట్ చేశారు. ఇటీవల కాలంలో ఆయన ఇంత స్టయిలిష్‌గా కనిపించినది లేదు. లుక్స్ నుంచి యాక్టింగ్ వరకు ఫ్యాన్స్ కళ్ళకు పండగ. పవన్ తర్వాత ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. ప్రియాంక మోహన్ రోల్ లెంత్ తక్కువ. ఉన్నంతలో బావుంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్‌లకు బలమైన క్యారెక్టర్లు పడ్డాయి. అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్, శుభలేఖ సుధాకర్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. తేజ్ సప్రు, సుదేవ్ నాయర్ విలనిజం ఓకే.
తీర్పు:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ డై హార్డ్ ఫ్యాన్ బాయ్ సుజీత్ తెరకెక్కించిన పవర్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఫిల్మ్ ‘ఓజీ’. తెలుగు స్క్రీన్ మీద హాలీవుడ్ స్టైల్ యాక్షన్‌తో వచ్చిన సినిమా ‘ఓజీ’. బాక్సులు బద్దలయ్యే రేంజ్‌లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఆయన ఆర్ఆర్ గురించి మాట్లాడుతుంది. పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. యాక్షన్ చిత్రాల ప్రేమికులు అసలు మిస్ అవ్వకూడదు.