భారతదేశ చరిత్రలో కొన్ని దేవాలయ కట్టడాలు కేవలం రాళ్లతో కట్టిన అద్భుతమైన నిర్మాణాలు కావు, అవి భారత దేశపు ఆత్మకు, సంస్కృతి కి ప్రతీకలు. అటువంటి వాటిలో సుప్రసిద్ధమైనది, అగ్రగణ్యమైనది గుజరాత్ తీరాన వెలసిన సోమనాథ్ క్షేత్రం. దీనిని ప్రభాస క్షేత్రం అని కూడా అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన ఈ ఆలయం, భారతీయ నాగరికత ఎదుర్కొన్న విధ్వంసాలకు మరియు ఆ విధ్వంసాలను అధిగమించి సాధించిన విజయాలకు సజీవ సాక్ష్యం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవం స్వతంత్ర భారత చరిత్రలో, సర్ధార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని, ఈ మహత్తర ప్రయాణాన్ని స్మరించు కోవడమే కాకుండా, నవ భారత ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సోమనాథ్ దేవాలయ చరిత్ర ఒక నిరంతర సంఘర్షణ తో కూడుకున్నది. 11వ శతాబ్దంలో మహమ్మద్ ఘజనీ చేసిన క్రూరమైన దాడి నుండి 18వ శతాబ్దంలో ఔరంగజేబు చేసిన విధ్వంసం వరకు, ఈ ఆలయం అనేకసార్లు నేలమట్టమైంది. దురాక్రమణదారులు కేవలం ఆలయ సంపదను దోచుకోవడమే కాకుండా, భారతీయుల విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూశారు. కాని, ప్రతి విధ్వంసం తర్వాత భారతీయ సమాజం మరింత పట్టుదలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించింది. ఇది భారతీయుల నమ్మకానికి, సంస్కృతికి ఉన్న అజేయమైన శక్తిని నిరూపిస్తుంది.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ మాటల్లో…
“సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం అనేది కేవలం ఒక కట్టడాన్ని నిర్మించడం కాదు, ఇది భారతీయ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం. మహాసముద్రం అంచున ఉన్న ఈ ఆలయం, భారతదేశపు అజేయమైన శక్తిని ప్రపంచానికి చాటిచెబుతుంది.” అని అన్నారు.
స్వాతంత్ర్యానంతరం సోమనాథ్ మందిర పునర్నిర్మాణం ఒక కీలక మలుపు. జునాగఢ్ విముక్తి తర్వాత అక్కడికి చేరుకున్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్, సముద్ర తీరాన నిలబడి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం తీసుకున్నారు. అది కేవలం ఒక ఆలయ కట్టడం కాదు, శతాబ్దాల బానిసత్వ చిహ్నాలను చెరిపివేసి, స్వతంత్ర భారతదేశ గౌరవాన్ని పునరుద్ధరించే ఒక “పవిత్ర యజ్ఞం”. “వల్లభభాయ్ పటేల్” తీసుకున్న ఆ నిర్ణయం నేటికీ దేశభక్తికి చిహ్నంగా నిలుస్తోంది.
అయితే ఈ పునర్నిర్మాణ ప్రక్రియ రాజకీయ విభేదాలకు కూడా వేదికైంది. అప్పటి ప్రధాని నెహ్రూ, లౌకికవాదం పేరుతో ఈ నిర్మాణానికి దూరంగా ఉండాలని భావించారు. దీనిని హిందూ పునరుద్ధరణ వాదంగా ఆయన అభివర్ణించారు. కానీ, నాటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ మాత్రం, మతం పట్ల విముఖత చూపడం లౌకికవాదం కాదు, అన్ని విశ్వాసాలను గౌరవించడం నిజమైన భారతీయం” అని స్పష్టం చేస్తూ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఘర్షణ భారతదేశపు లౌకికవాద నిర్వచనంపై ఒక లోతైన చర్చకు దారితీసింది.
సోమనాథ్ మందిరం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ప్రాచీన భారతీయ విజ్ఞానానికి నిలయం. ఆలయ ప్రాంగణంలో ఉన్న “బాణస్తంభం” మన పూర్వీకుల ఖగోళ, భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతుంది. ఈ స్తంభం నుండి దక్షిణ ధ్రువం (South Pole) వరకు భూమిపై ఎక్కడా ఎలాంటి అడ్డు లేని నీటి మార్గం ఉందని ఆ కాలంలోనే గుర్తించడం అద్భుతం. నేటి ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం, మన ప్రాచీన విజ్ఞాన విశిష్టతను, ప్రపంచానికి చాటుతోంది. విదేశీ దాడుల వల్ల దేవాలయ చరిత్ర, సంస్కృతి, నే కాకుండా పుస్తక భాండాగారం అయిన నలంద విశ్వ విద్యాలయాలను కాల్చి బూడిద చేయడం వలన తరతరాల విజ్ఞాన సంపద, విద్యా సంపద మనకు చెందవలసిన, అందవలసినది నాశనం అయిపోయింది.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో సోమనాథ్ క్షేత్రం ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దబడింది. 75 ఏళ్ల పునఃప్రతిష్ఠ వేడుకలను అమృత్ మహోత్సవంగా నిర్వహించడం ద్వారా, ప్రభుత్వం ప్రస్తుత తరానికి మన చరిత్రను చేరువ చేసింది. ప్రాచీన వారసత్వాన్ని గౌరవిస్తూనే, అక్కడ పర్యాటక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ఆధ్యాత్మికతను ఆర్థికాభివృద్ధితో జోడించారు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, మన మూలాలను వెతుక్కునే ఒక ప్రయాణం.
ఈ వేడుకల ద్వారా మన దేశానికి అందుతున్న ప్రధాన సందేశం బానిసత్వ మనస్తత్వం నుండి విముక్తి. శతాబ్దాల తరబడి మన సంస్కృతిని, మన ధర్మాన్ని, చిన్నచూపు చూసిన కాలం ముగిసిందని, విద్యా, వైద్యానిక రంగాలలో దూసుకుపోతున్న భారత్, ఇప్పుడు మన వారసత్వాన్ని గర్వంగా ప్రపంచం ముందు ప్రదర్శించవచ్చని ఈ ఉత్సవం ద్వారా చాటిచెబుతోంది. వికాసం అంటే కేవలం భౌతిక ప్రగతి మాత్రమే కాదు, మన విశ్వాసం కూడా బలంగా ఉండాలని ప్రధాని సందేశం స్పష్టం చేస్తోంది.
ఈ 75 ఏళ్ల ప్రయాణం మనకు ఒక పాఠం లాంటిది. విధ్వంసం తాత్కాలికమని, సృజన శాశ్వతమని సోమనాథ్ దేవాలయం నిరూపించింది. ఎన్ని దాడులు జరిగినా, సత్యం మరియు ధర్మం మళ్ళీ నిలబడతాయని ఈ క్షేత్రం, మరియు మన సనాతన ధర్మం చెబుతోంది. సర్దార్ పటేల్ కన్న కలలు నేడు సాకారం అవుతుండటం, భారతదేశం తన సాంస్కృతిక సార్వభౌమాధికారాన్ని తిరిగి పొందుతుందనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.
వ్యాపార, పర్యాటక కోణాల్లో కూడా సోమనాథ్ ప్రాముఖ్యత పెరిగింది. “ప్రసాద్” (PRASHAD) పథకం ద్వారా అక్కడ నిర్మించిన మౌలిక సదుపాయాలు లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక దేవాలయం దేశపు ఆర్థిక వ్యవస్థకు మరియు ఐక్యతకు ఎలా దోహదపడుతుందో “సోమనాథ్” దేవాలయం నేడు నిరూపిస్తోంది. ఇది నవ భారత నిర్మాణంలో ఒక ముఖ్యమైన అడుగు.
సోమనాథ్ అమృత్ మహోత్సవం అనేది గత వైభవాన్ని స్మరించుకుంటూనే, భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేయమని భారతీయులకు పిలుపునిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ వంటి మహనీయుల ఆశయాలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయి. సోమనాథ్ జ్యోతిర్లింగం వెలుగులో భారతదేశం తన సాంస్కృతిక దిక్సూచిని సరిచేసుకుంటూ, ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది. తొందరలోనే “విశ్వగురు” గా ఆవిర్భవిస్తుంది. ఇదే మన ధర్మం గొప్పతనం.
ముగింపు: ప్రధాని నరేంద్ర మోడీ సందేశం.. “సోమనాథ్ ఆలయం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. దురాక్రమణదారులు మన మత విశ్వాసాలను, సంస్కృతిని నాశనం చేయాలని చూసినా.. మన మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో, మన సంకల్పం ఎంత బలమైనదో, చెప్పడానికి ఈ క్షేత్రమే సాక్ష్యం.” అని తన సందేశాన్ని ఇచ్చారు.