Download App

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చిక్కుల్లో కాంగ్రెస్ నాయకులు…

జూన్ 2, 2026 • By Suresh Thota
తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ఒక్కో అడుగు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని వ్యవహారంగా మారుతోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామనే ప్రకటనతో ఈ పొలిటికల్ హీట్ సమ్మర్ హీట్ ను దాటిపోయింది… తాజా...

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేసిన ఒక్కో అడుగు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని వ్యవహారంగా మారుతోంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామనే ప్రకటనతో ఈ పొలిటికల్ హీట్ సమ్మర్ హీట్ ను దాటిపోయింది… తాజా పరిణామాలతో పీక్‌కు చేరింది. హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల ప్రెస్ మీట్ వేదికగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం, దానికి కౌంటర్‌గా ఆయన టీం విసిరిన సవాళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణమయ్యాయి.

ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అనవసరంగా లేని తలపోటును నెత్తిన వేసుకుందా…? పవన్ విసిరిన వ్యూహాత్మక “ట్రాప్” లో అధికార పక్షం చిక్కుకుందా….? అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. నిజానికి, ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కళ్యాణ్ మరియు అమిత్ షా మధ్య జరిగిన మీటింగ్ పై తనదైన భాష్యం చెప్పారు…. అది పెద్ద దుమారం రేపింది… ఎక్కడివరకు వెళ్ళింది అంటే…. తెలంగాణలో అడుగుపెట్టడంపై సవాలు విసురుకునేంత వరకు వెళ్ళింది. ఇక్కడి కొందరు జర్నలిస్టులు ప్రెస్ మీట్ లో పర్సనల్ విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.

అయితే, జర్నలిస్టుల ప్రెస్ మీట్ వెనుక కాంగ్రెస్ పార్టీ పరోక్ష హస్తం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా సాగింది. పవన్‌ కళ్యాణ్ ను నేరుగా ఢీకొడితే ఆంధ్రా సెటిలర్ల ఓటు బ్యాంకు ఎక్కడ దూరం అవుతుందోనన్న భయంతోనే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా జర్నలిస్టులను ముందుంచి ఈ వ్యవహారాన్ని నడిపించిందనే టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ వ్యూహం కాంగ్రెస్‌కు రివర్స్ అయిందని చెప్పాలి. పవన్‌ను నిలువరించాలనుకున్న కాంగ్రెస్ ప్రయత్నం కాస్తా…. ఆయనకు మరింత పొలిటికల్ మైలేజ్ వచ్చేలా మారి, అధికార పార్టీ అనవసరంగా ఒక పెద్ద రచ్చను తన నెత్తిన వేసుకున్నట్లయింది. అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో… చిక్కుల్లో కాంగ్రెస్ నాయకులు…

ఇక ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ తన భూములపై విసిరిన సవాల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతిరక్షణాత్మక (Defensive) స్థితిలోకి నెట్టింది. తెలంగాణలో తనకు ఉన్న భూమి ప్రభుత్వానిదే అని నిరూపిస్తే, తానే స్వచ్ఛందంగా ఆ భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని “పవన్ కళ్యాణ్” ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అది నిజం కాకపోతే విమర్శలు చేసిన వారు సైలెంట్ అయిపోతారు. కాని ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు పెద్ద పరీక్షగా మారతాయి. జనసేన సభకి పర్మిషన్ ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి ఈ తలపోటు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఈ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సమర్థించుకోవాలో తెలియక సతమతమయ్యే పరిస్థితి కనపడుతుంది.

ఈ వివాదానికి పవన్ కళ్యాణ్ ఇంతటితో బ్రేక్ వేయలేదు, దీనికి “ప్రాంతీయవాదం” రంగు పులిమి కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని సైతం ఇందులో లాగడం అత్యంత వ్యూహాత్మక మలుపు. తాను పక్క రాష్ట్రం (ఆంధ్రా) వాడినైతే.. మరి ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణకు వచ్చి ఎలా రాజకీయం చేస్తారని పవన్ ప్రశ్నించారు. వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయవచ్చని, పదవులు అనుభవించవచ్చని, ఇందిరా గాంధీ మెదక్ నుండి గెలవవచ్చు కాని, పక్కనే ఉన్న ఆంధ్రా నుంచి తాను వస్తే ప్రాంతీయవాదాన్ని ఎలా లేపుతారంటూ ఆయన వేసిన ప్రశ్న కాంగ్రెస్ టాప్ లీడర్‌షిప్‌కు నేరుగా తగిలింది. గాంధీ కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగడం ద్వారా పవన్ కాంగ్రెస్ నోళ్లు నొక్కేసే ప్రయత్నం చేశారు.

ఈ జాతీయ నేతల ప్రస్తావన తో జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయింది. దీనిని బహిరంగంగా సమర్థించుకోవడానికి ఏపీ లో కాని, జాతీయ స్థాయిలో కాని గట్టిగా తంటాలు పడాల్సి వస్తోంది. “రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జాతీయ నాయకులు, దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు వారికి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఒక పొరుగు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రేపుతున్నారు” అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ అడిగిన సరళమైన ప్రశ్న ప్రజల్లోకి బలంగా వెళ్లింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. ప్రాంతీయత కార్డును వాడుతూ “పవన్‌ కళ్యాణ్” ను అడ్డుకోవాలని చూడటం వారి ద్వంద్వ విధానాన్ని తెలియజేస్తుంది అనే భావన పబ్లిక్‌లో ఏర్పడటంతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో… చిక్కుల్లో కాంగ్రెస్ నాయకులు…

రాజకీయ లాభనష్టాల కోణంలో చూస్తే…. ఈ మొత్తం ఎపిసోడ్ ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, జనసేనల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్ వల్ల ఓట్లు చీలిపోతే, అది అంతిమంగా బీఆర్ఎస్ కనుసన్నల్లో ఉన్న బలమైన క్షేత్రస్థాయి క్యాడర్‌కు ప్లస్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో సెటిలర్లు, యువత ఓట్లు చీలిపోతే అధికార కాంగ్రెస్ పార్టీ చేజేతులా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల లొసుగులతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు “పవన్ కళ్యాణ్” ఎంట్రీ “పులి మీద పుట్రా” (ఒక సమస్యపై మరో సమస్య రావడం) లాగా తయారైంది.

మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారీగా పుంజుకున్న బీజేపీకి కూడా జనసేన ఒంటరి పోరు ఒక సవాల్‌గా మారింది. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన.. తెలంగాణలో ఒంటరిగా వెళ్తామనడం హిందూత్వ మరియు అర్బన్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. “పవన్ కళ్యాణ్” ఏపీ సక్సెస్ జోష్‌లో తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి ఒక బలమైన రూపాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలన్నా, బేరసారాల శక్తి (Bargaining Power) పెంచుకోవాలన్నా ఈ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటడం పవన్‌కు అత్యంత కీలకం. అందువల్లనే ఆయన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా కాంగ్రెస్‌పై మైండ్ గేమ్ ఆడుతున్నారు.

​ముగింపు: పవన్ కళ్యాణ్ విసిరిన ఈ సవాళ్లు, వ్యాఖ్యల వెనుక కేవలం ఆవేశం లేదు. తెలంగాణ రాజకీయాల్లో తానూ ఒక నిర్ణయాత్మక శక్తినని నిరూపించుకునే దీర్ఘకాలిక వ్యూహం ఉంది. తెలియని పాము కరిస్తే మంత్రం లేదన్నట్లుగా.. కాంగ్రెస్ ఈ వివాదాన్ని ఇంకా సాగదీస్తే తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల ప్రెస్ మీట్ ద్వారా పవన్‌ను కార్నర్ చేయాలనుకుని, చివరకు గాంధీ కుటుంబంపై వ్యాఖ్యల వరకు తెచ్చుకుని కాంగ్రెస్ అనవసరంగా సెల్ఫ్ గోల్ చేసుకుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పవన్ విసిరిన ఈ పదునైన పాచికల నుండి కాంగ్రెస్ ఎలా గట్టెక్కుతుందో.. లేక ఆ పొలిటికల్ ట్రాప్‌లోనే మరింతగా చిక్కుకుపోతుందో రాబోయే రోజుల్లో వేచిచూడాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading