భారత కరెన్సీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 95 మార్కును దాటి సరికొత్త కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. RBI తీసుకున్న చర్యలు, చేసిన ప్రయత్నాలు రూపాయి పతనాన్ని కట్టడి చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా రూపాయి విలువ 95.12 కు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోని ఒడిదుడుకుల కారణంగా భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక నిఫ్టీ (NIFTY) 500 పాయింట్లకు పైగా క్షీణించింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు కుప్పకూలాయి.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక కీలకమైన సవాలును ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ మునుపెన్నడూ లేని విధంగా శక్తివంతంగా మారడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తోడవడంతో రూపాయి విలువ మొదటిసారిగా “95” రూపాయల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిణామం దేశ విదేశీ మారక నిల్వలపై (Foreign Exchange Reserves) తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
ఈ సంక్షోబానికి గల కారణాలను, మరియు రూపాయిని పటిష్ట పరచే మార్గాలను ఇక్కడ వివరంగా విశ్లేషిద్దాం.
రూపాయి విలువ తగ్గడం వల్ల దేశ ఆర్థిక పునాదులు ఏ విధంగా ప్రభావితమవుతాయో పరిశీలిద్దాం…
భారత్ తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతి చేసుకుంటుంది. రూపాయి బలహీనపడటంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి విలువ పడిపోవడం వల్ల భారత్ ఎక్కువ మొత్తంలో డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. ఉదా: …. గతంలో ఒక బ్యారెల్ చమురు ధర 80 ఉండి, డాలర్ విలువ ₹85 ఉంటే, మనం ₹6,800 చెల్లించేవాళ్ళం. ఇప్పుడు అదే చమురు ధర మారకపోయినా, డాలర్ విలువ ₹95 కి చేరడం వల్ల సుమారుగా మనం ₹7,600 చెల్లించాల్సి వస్తోంది. డాలర్ విలువ ₹85 నుండి ₹95 కి పెరిగితే, ప్రతి బ్యారెల్ పైన భారత్ అదనంగా ₹800 నుండి ₹1000 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, వంట నూనెలు, మరియు యంత్ర పరికరాల దిగుమతి ధరలు పెరగడం వల్ల దేశం నుండి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక పునాదులపై ఒత్తిడిని పెంచుతుంది.
ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కంటే దిగుమతుల కోసం చేసే ఖర్చు ఎక్కువైతే దానిని కరెంట్ అకౌంట్ లోటు అంటారు. రూపాయి పతనం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారి ఈ లోటు పెరుగుతుంది. దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం అదనపు అప్పులు చేయాల్సి వస్తుంది. కరెంట్ అకౌంట్ లోటు పెరిగితే, రూపాయిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి దేశం తన విదేశీ మారక నిల్వలపై ఆధారపడాల్సి వస్తుంది లేదా విదేశీ అప్పులను ఆశ్రయించాల్సి వస్తుంది, ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు శ్రేయస్కరం కాదు.
రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుండి డాలర్లను మార్కెట్లో విక్రయిస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా రూపాయి నిలదొక్కుకున్నప్పటికీ, దేశ అత్యవసర నిల్వలు (Forex Reserves) వేగంగా తగ్గిపోతాయి. గత కొన్ని నెలలుగా రూపాయిని కాపాడే ప్రయత్నంలో భారత్ వద్ద ఉన్న నిల్వలు $700 బిలియన్ల నుండి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. రూపాయి విలువ నిరంతరం పడిపోతుంటే విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) ఆందోళన చెందుతారు. తమ పెట్టుబడుల విలువ తగ్గిపోతుందనే భయంతో వారు భారత స్టాక్ మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించుకుని డాలర్లలోకి మారుస్తారు. ఇది రూపాయిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.
రూపాయిని మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావడానికి లేదా కనీసం స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం మరియు ఆర్బీఐ సమన్వయంతో ఈ క్రింది చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఆర్థిక నిపుణులు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు.
ఆర్బీఐ రెపో రేటును పెంచడం ద్వారా మార్కెట్లో రూపాయి లభ్యతను తగ్గించవచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ ఇన్వెస్టర్లు భారత బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతారు, దీనివల్ల డాలర్ల ప్రవాహం పెరిగి రూపాయి బలపడుతుంది. బ్యాంకుల వద్ద ఉన్న నగదును నియంత్రించడం ద్వారా స్పెక్యులేషన్‌ను అరికట్టవచ్చు.
రష్యా, యూఏఈ, మరియు ఆగ్నేయాసియా దేశాలతో జరిపే వాణిజ్యాన్ని డాలర్లకు బదు లుగా నేరుగా “రూపాయి” ల లోనే జరిపేలా ఒప్పందాలు చేసుకోవాలి. దీనివల్ల డాలర్లకు ఉండే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది. రష్యా వంటి దేశాల నుండి రాయితీ పై లభించే చమురును అధికంగా దిగుమతి చేసుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.
బంగారం వంటి అత్యవసరం కాని వస్తువుల దిగుమతి పై సుంకాలను (Customs Duty) పెంచడం ద్వారా డాలర్ల ఖర్చును తగ్గించవచ్చు. టెక్స్‌టైల్స్, సాఫ్ట్‌వేర్, మరియు ఫార్మా రంగాల ఎగుమతిదారులకు రాయితీలు ఇవ్వడం ద్వారా దేశంలోకి ఎక్కువ డాలర్లు వచ్చేలా చూడాలి.
అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టంగా ఉన్నప్పుడు, భారత్ తన వద్ద ఉన్న వ్యూహాత్మక భూగర్భ నిల్వల నుండి చమురును వాడుకోవాలి. దీనివల్ల కొత్తగా చమురు కొనడానికి డాలర్లను ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు, ఇది రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు దేశంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేక బాండ్లను (NRR Bonds) ప్రవేశపెట్టాలి. వారు పంపే డాలర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిస్తాయి.
రూపాయి పతనం అనేది కేవలం ఆర్థిక గణాంకం కాదు, ఇది సామాన్యుడి జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అంశం. అంతర్జాతీయ పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా, పైన పేర్కొన్న సూచనల ద్వారా రూపాయిని మళ్ళీ శక్తివంతంగా మార్చవచ్చు. దేశం స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేయడమే రూపాయి స్థిరత్వానికి శాశ్వత పరిష్కారం. ఇది భారతీయులు అందరూ ఒక మాట పై నిలిచిన రోజున రూపాయి సగర్వంగా నిలబడుతుంది.