
ప్రపంచ రక్షణ రంగంలో ఆసియా లో చాలా దేశాలు రక్షణ రంగ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తూ ఎదుగుతున్నాయి. వాటి మధ్యలో భారత్ కూడా రక్షణ రంగంలో పెట్టుబడులు పెడుతూ, తన ప్రయాణం సాగిస్తుంది. ఒకప్పుడు ప్రపంచ రక్షణ రంగం అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల ఆధిపత్యమే కనిపించేది. ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు అన్నింటికీ ఆసియా దేశాలు ఎక్కువగా కొనుగోలుదారులుగానే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రపంచ పరిస్థితి వేగంగా మారుతోంది. యుద్ధాల స్వరూపం మారింది. భౌగోళిక రాజకీయ పోటీ పెరిగింది. దేశాలు తమ భద్రత విషయంలో ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని గ్రహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆసియా దేశాలు ఇప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే స్థాయి నుంచి, ఆయుధాలు తయారు చేసి ప్రపంచానికి అమ్మే దేశాలు, గా మారుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, టర్కీ, చైనా, భారత్ వంటి దేశాలు ప్రపంచ రక్షణ రంగంలో కొత్త శక్తులుగా ఎదుగుతున్నాయి.
ఈ మార్పు వెనుక ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, తైవాన్ చుట్టూ చైనా కదలికలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సైనిక పోటీ ఇవన్నీ ప్రపంచ దేశాలను భారీగా ఆయుధాల కొనుగోళ్ల వైపు నెట్టాయి. కాని ఇక్కడే ఒక సమస్య వచ్చింది. అమెరికా, యూరప్ దేశాల తయారీ సంస్థలు అత్యాధునిక ఆయుధాలు తయారు చేస్తున్నప్పటికీ, వాటి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సరఫరా సమయం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఒక యుద్ధ విమానం కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖాళీని ఆసియా దేశాలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో, వేగంగా, ఆధునిక సాంకేతికతతో ఆయుధాలు అందించగల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రపంచ రక్షణ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా మారింది. ప్రధానంగా యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, సాయుధ వాహనాలు (ట్యాంకులు), యుద్ధ నౌకలు మరియు రాకెట్ లాంచర్లను ఎగుమతి చేస్తోంది. యుద్ధ విమానాల తయారీలో ఆ దేశం భారీ పురోగతి సాధించింది. యూరప్ దేశాలే ఇప్పుడు దక్షిణ కొరియా తయారీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి.
మరోవైపు “టర్కీ” డ్రోన్ యుద్ధ సాంకేతికతలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. “టర్కీ” తయారు చేసిన యుద్ధ డ్రోన్లు “ఉక్రెయిన్” యుద్ధంలో ప్రభావం చూపడంతో ప్రపంచ దేశాలు వాటి వైపు దృష్టి మళ్లించాయి. “చైనా” ఇప్పటికే భారీ రక్షణ తయారీ శక్తిగా ఎదిగింది. యుద్ధ నౌకలు, భారీ యుద్ధ విమానాలు, అతి వేగ వంతమైన క్షిపణులు, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ వ్యవస్థలలో “చైనా” ఇప్పుడు అమెరికాకు సవాలు విసురుతూ , అగ్రస్థాయికి చేరుకుంది. అమెరికా ఆంక్షలను లెక్కచేయని స్థితి, లక్ష్య పెట్టని స్థాయి లో ఉంది.
ఈ ఆసియా దేశాల ఎదుగుదల మధ్య భారత్ పరిస్థితి ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశాలలో భారత్ ఒకటి. ప్రత్యేకంగా 2014కు ముందు భారత రక్షణ రంగంపై ప్రధాన విమర్శ ఏమిటంటే ….. “భారత్ వద్ద పెద్ద సైన్యం ఉంది, కానీ తయారీ శక్తి లేదు” అన్నది. యుద్ధ విమానాలు విదేశాల నుంచి, తుపాకులు విదేశాల నుంచి, క్షిపణి భాగాలు విదేశాల నుంచి, రాడార్ వ్యవస్థలు విదేశాల నుంచి, ఆఖరికి సైన్యం వాడే షూస్ కి కూడా విదేశాల నుండి కొనుగోలు చేసే పరిస్థితి గా ఉండేది. అనేక రక్షణ ఒప్పందాలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నాయి. నిర్ణయాల ఆలస్యం, అధిక అధికార వ్యవస్థ, దేశీయ తయారీ సంస్థలకు తగిన ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలతో భారత్ “కొనుగోలు దేశం”గానే మిగిలిపోయింది.
అయితే 2014 తర్వాత పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించడం ప్రారంభమైంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆయుధాల జాబితాను తగ్గిస్తూ, దేశీయంగా తయారు చేసే ఆయుధాలకు ప్రోత్సాహం ఇచ్చింది. ప్రైవేట్ సంస్థలకు కూడా రక్షణ తయారీలో అవకాశాలు కల్పించింది. క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, యుద్ధ నౌకలు, పర్యవేక్షణ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాల తయారీలో భారత్ వేగంగా పురోగతి సాధించడం ప్రారంభించింది. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి, అగ్ని క్షిపణి శ్రేణులు, విక్రాంత్ యుద్ధ నౌక, జలాంతర్గాములు, తేజస్ యుద్ధ విమానం వంటి ప్రాజెక్టులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
ఇప్పటి భారత్ స్వయం సమృద్ధి సాధిస్తున్న రక్షణ శక్తిగా చెప్పడం సబబు…. ఎందుకంటే ఇంకా అనేక కీలక రంగాల్లో విదేశాల పై ఆధారపడటం కొనసాగుతోంది. ముఖ్యంగా యుద్ధ విమానాల ఇంజిన్లు, అత్యాధునిక సూక్ష్మ సెమీ కండక్టర్ చిప్ సాంకేతికత, కొన్ని సెన్సార్ వ్యవస్థలు, అధునాతన గగన యుద్ధ సాంకేతికతలలో భారత్ ఇంకా స్వయంసమృద్ధి సాధించాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఇప్పుడు కేవలం కొనుగోలు చేసే దేశం కాదు. “డిజైనింగ్, మ్యాన్ ఫాక్చరింగ్ , టెస్టింగ్, మరియు ఎగుమతి చేసే” దేశంగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే అసలు వ్యూహాత్మకమైన మార్పు.
ప్రపంచం కూడా ఇప్పుడు “భారత్”ను కొత్త దృష్టితో చూడటం ప్రారంభించింది. “ఫిలిప్పీన్స్” వంటి దేశాలు ఇప్పటికే భారత “బ్రహ్మోస్” క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేశాయి. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలు భారత రక్షణ పరికరాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే భారత్‌ను అనేక దేశాలు “సమతుల్య వ్యూహాత్మక భాగస్వామి”గా, పరిగణిస్తున్నాయి. చైనా పై ఉన్న భయాందోళనలు భారత్‌పై లేవు. పాశ్చాత్య దేశాల మాదిరిగా అధిక రాజకీయ ఒత్తిళ్లు కూడా భారత్ నుంచి రావని అనేక దేశాలు భావిస్తున్నాయి. ఇదే భారత్‌కు భవిష్యత్‌లో పెద్ద అవకాశంగా మారవచ్చు.
అయితే భారత్ ముందున్న అసలు సవాలు ఇప్పుడు మొదలవుతోంది. రక్షణ రంగంలో ప్రపంచ అగ్రశక్తిగా ఎదగాలంటే కేవలం దేశీయ తయారీ సరిపోదు. అత్యున్నత సాంకేతిక పరిశోధన, వేగవంతమైన తయారీ వ్యవస్థ, యుద్ధ అవసరాలకు తక్షణ ప్రతిస్పందన, స్వదేశీ ఇంజిన్ సాంకేతికత, సెమీ కండక్టర్ చిప్ తయారీ, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ వ్యవస్థలు ఇవన్నీ ఉండాలి అవసరం కూడా, చైనా, అమెరికా స్థాయికి చేరుకోవాలంటే దశాబ్దాలపాటు నిరంతర పెట్టుబడులు, పారిశ్రామిక మార్పులు అవసరం. ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా ఒక విషయం చెబుతోంది. భారత్ ఇక ప్రపంచ రక్షణ రంగంలో పక్కన నిలబడి చూసే దేశం ఎంత మాత్రం కాదు.
ప్రపంచ రక్షణ రంగంలో జరుగుతున్న ఈ ఆసియా ఎదుగుదల కేవలం వ్యాపార మార్పు కాదు. ఇది భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చే పరిణామం. యుద్ధాలు ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో జరగడం లేదు. సాంకేతికత, సమాచార ఆధిపత్యం, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష వ్యవస్థలు, డ్రోన్ దళాలు ఆధారంగా జరుగుతున్నాయి. ఇవే భవిష్యత్ యుద్ధాల ఆయుధాలు. ఈ ఆధునిక యుగంలో భారత్ తన స్థానాన్ని పదిలపరచుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడిన భారత్, ఇప్పుడు తన అవసరాలను తానే తీర్చుకుని, ప్రపంచానికి ఆయుధాలు సరఫరా చేసే స్థాయికి చేరాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయాణం ఇంకా పూర్తికాలేదు. కానీ దారి మాత్రం స్పష్టంగా ఏర్పరచుకుంది.
