సినిమా వార్తలు

‘ఐక్య ధైర్య సేన సమితి’ ప్రారంభించిన మంచు మనోజ్ – సేవా కార్యక్రమాలకు శ్రీకారం

Published by
Srinivas

తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు. “Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అభిమానులు, వాలంటీర్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్ మంచు భావోద్వేగంతో మాట్లాడుతూ, సేవా భావం తమ కుటుంబం నుంచి వచ్చిన విలువ అని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారందరికీ ఒక వేదిక అవసరమనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.

“సమాజానికి అండగా నిలబడటం, సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్న విలువలు. ఇంతకుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. కానీ అదే ఆలోచన కలిగిన వారందరికీ ఒక వేదిక ఉండాలని భావించి ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం,” అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యకు సహాయం చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రతి పట్టణం, గ్రామానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తామని తెలిపారు.

మౌనిక భూమా మంచు మాట్లాడుతూ, తమ తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని చెప్పారు. ఈ ట్రస్ట్ కేవలం రక్తదాన కార్యక్రమాలకే పరిమితం కాకుండా మహిళా సాధికారత, ఉపాధి కల్పన కోసం కూడా పనిచేస్తుందని వెల్లడించారు.

“‘నమస్తే వరల్డ్’ అనే సంస్థ ద్వారా టాయ్ మేకింగ్ కోర్సులతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సమాజానికి సేవ చేయడానికి ఇంకా ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి,” అని ఆమె తెలిపారు.

తర్వాత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారికంగా “ఐక్య ధైర్య సేన సమితి” పేరును ప్రకటిస్తూ, సేవా కార్యక్రమాల కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్న మనోజ్, మౌనికలను అభినందించారు.

“పిల్లలను దత్తత తీసుకోవడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. ఈ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల అంతటా తీసుకెళ్లేందుకు నా పూర్తి సహకారం ఉంటుంది,” అని నవీన్ యాదవ్ అన్నారు.

చివరగా మనోజ్ మంచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరానికి సహకరించిన అమోర్ హాస్పిటల్ ప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

ఇక సినీ పరంగా చూస్తే, ఇటీవల విడుదలైన మిరాయి చిత్రంలో మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వోర్డ్ పాత్రలో మనోజ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రిటిష్ కాలం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ దాటింది.

సినిమాలతో పాటు ఇకపై సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా ముందుకు సాగాలని మనోజ్ మంచు స్పష్టం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.