Download App

‘డిసర్ట్ థండర్’ తో ప్రపంచానికి తెలిసిన భారత ‘అపాచీ’ శక్తి

ఏప్రిల్ 12, 2026 • By Suresh Thota
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌ లో నిర్వహించిన "డిసర్ట్ థండర్" విన్యాసాలు మరోసారి భారత సైన్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఈ విన్యాసాల్లో "అపాచీ" AH-64E అటాక్ హెలికాప్టర్లు ప్రదర్శించిన శక్తి, ఖచ్చితత్వం కేవలం సైనిక సామర్థ్యానికి మాత్రమే కాదు, భారతదేశం సాధిస్తున్న రక్షణ మరియు రక్షణ రంగ...
'డిసర్ట్ థండర్' తో ప్రపంచానికి తెలిసిన భారత 'అపాచీ' శక్తి

రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌ లో నిర్వహించిన “డిసర్ట్ థండర్” విన్యాసాలు మరోసారి భారత సైన్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఈ విన్యాసాల్లో “అపాచీ” AH-64E అటాక్ హెలికాప్టర్లు ప్రదర్శించిన శక్తి, ఖచ్చితత్వం కేవలం సైనిక సామర్థ్యానికి మాత్రమే కాదు, భారతదేశం సాధిస్తున్న రక్షణ మరియు రక్షణ రంగ ఆధారిత పారిశ్రామిక పురోగతికి కూడా ప్రతీకగా నిలిచాయి.

“అపాచీ” హెలికాప్టర్‌ను “గాలిలో కదిలే ట్యాంక్” గా అభివర్ణిస్తున్నారు. అత్యాధునిక హెల్‌ఫైర్ మిస్సైల్స్, హైడ్రా రాకెట్లు, 30 మి.మీ చైన్ గన్ వంటి భారీ ఆయుధాలు దీనికి అమర్చబడి ఉన్నాయి. దీనికి అమర్చిన “లాంగ్‌ బో రాడార్” (Longbow Radar) అనేది “అపాచీ” అటాక్ హెలికాప్టర్‌లో ఉండే అత్యాధునిక “ఫైర్ కంట్రోల్ రాడార్” (Fire Control Radar). ఇది ప్రధానంగా శత్రు లక్ష్యాలను గుర్తించడం, ట్రాక్ చేయడం, దాడి చేయడం కోసం ఉపయోగిస్తారు. “లాంగ్‌బో రాడార్” ఒకేసారి వందల లక్ష్యాలను గుర్తించి, అత్యంత ప్రమాదకర లక్ష్యాలపై క్షణాల్లో దాడి చేయగలదు. రాత్రిపూట కూడా పగలు లాంటి స్పష్టతతో శత్రువులను వేటాడే సామర్థ్యం దీనికి ఉంది. శత్రువుల కాల్పులను తట్టుకునే విధంగా కవచం ని నిర్మించారు, ఒక ఇంజన్ దెబ్బతిన్నా మరో ఇంజన్‌తో తిరిగి రావడం వంటి లక్షణాలు దీనిని అత్యంత విశ్వసనీయ యుద్ధ యంత్రంగా నిలబెడుతున్నాయి.

అయితే ఈ కథలో అసలు ఆసక్తికర మలుపు ఇక్కడే ఉంది. ఈ “అపాచీ” హెలికాప్టర్లు అమెరికా సాంకేతికతతో తయారైనప్పటికీ, వాటి హృదయం గా చెప్పుకునే ప్రధాన నిర్మాణ భాగం “ఫ్యూజ్‌లేజ్”మన హైదరాబాద్‌లో తయారవుతోంది. అంటే మన సాధారణ భాషలో చెప్పాలంటే, ఫ్యూజ్‌లేజ్ (Fuselage) అంటే ఒక విమానం లేదా హెలికాప్టర్ యొక్క ‘ప్రధాన బాడీ’ లేదా ‘శరీరం’ గా చెప్పవచ్చు. బోయింగ్ మరియు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో ఏర్పడిన “టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్” ప్లాంట్ ఈ కీలక బాధ్యతను నిర్వహిస్తోంది.

ఇది కేవలం భారత్ కోసం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ “అపాచీ” హెలికాప్టర్ ఎగిరినా, అందులో మన హైదరాబాద్‌లో తయారైన బాడీ ఉంటుంది అనేది గర్వకారణం. అమెరికా ఆర్మీ వాడే “అపాచీ” ల్లో కూడా “మేడ్ ఇన్ ఇండియా” భాగాలు ఉండటం, భారత పారిశ్రామిక సామర్థ్యానికి స్పష్టమైన నిదర్శనం. అంతేకాదు, ఈ తయారీ ప్రక్రియలో దేశంలోని వందకు పైగా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (MSME) భాగస్వామ్యం కావడం, ఆర్థిక వ్యవస్థలో విస్తృత ప్రయోజనాలను సృష్టిస్తోంది.

ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది. “మేక్ ఇన్ ఇండియా” కేవలం ఒక నినాదం కాదు, అధునాతన రక్షణ రంగంలో భారత ప్రైవేట్ సంస్థలు ప్రపంచ స్థాయి నాణ్యతతో పనిచేయగలవని ఇది నిరూపిస్తోంది. ఇదే సమయంలో, భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన “ప్రచండ్” (LCH) అటాక్ హెలికాప్టర్ కూడా సైన్యంలో చేరడం, దేశం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలియజేస్తోంది.

“అపాచీ” మరియు “ప్రచండ్” ఈ రెండు హెలికాప్టర్లు ఇప్పుడు భారత సైన్యానికి రెండు కళ్లలాంటివి. ఒకటి అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రతీక కాగా, మరొకటి స్వదేశీ ప్రతిభకు ప్రతిబింబం. ఈ రెండింటి సమన్వయం భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. మొత్తానికి మొన్న జరిగిన పోఖ్రాన్ విన్యాసాల్లో గర్జించిన “అపాచీ” హెలికాప్టర్లు కేవలం శత్రువులకు హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశం కూడా ఇచ్చినట్లు అయ్యింది. భారతదేశం ఇక వినియోగదారుడు మాత్రమే కాదు, తయారీదారు కూడా. భవిష్యత్తులో “మేడ్ ఇన్ ఇండియా” ముద్ర మరింత బలంగా వినిపించే రోజులు మరెంతో దూరంలో లేవు. ఇది “నయా భారత్”.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.