
“ఎగదీస్తే బ్రహ్మహత్య… దిగదీస్తే గోహత్య” అనేది ఒక తెలుగు సామెత… ఇది ఇప్పుడు భారత దేశ పరిస్థితి.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్,అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ పటాన్ని కుదిపేస్తున్నాయి. ఈ ఘర్షణలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక, సామాజిక మరియు విదేశాంగ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆకాశానికి ఎగబాకుతున్న చమురు ధరలు… సామాన్యుడి పై పెరుగుతున్న భారం… భారతదేశం తన చమురు అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్యంపైనే ఆధారపడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హర్ముజ్ జల సంధి ప్రాంతంలో రవాణాకు అంతరాయం ఏర్పడితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమంటాయి. దీని ప్రభావం వలన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి (Inflation) దారితీస్తుంది.
“ప్రవాస భారతీయుల” భద్రత ప్రభుత్వంనకు సవాల్ గా పరిణమించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లో కోట్లాది మంది భారతీయులు జీవనోపాధి పొందుతున్నారు. యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్న నేపద్యంలో అక్కడ ఉన్న భారతీయుల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. గతంలో కువైట్ సంక్షోభం సమయంలో చేపట్టినట్లుగానే, భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు (Evacuation) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. జనాన్ని తరలిస్తుంది.
వాణిజ్యం మరియు సరఫరా వ్యవస్థ విచ్చిన్నం… భారత్ మధ్యప్రాచ్యం నుండి కేవలం చమురు మాత్రమే కాకుండా ఎరువులు, రసాయనాలను భారీగా దిగుమతి చేసుకుంటుంది. సముద్ర మార్గాల్లో యుద్ధ భయం వల్ల నౌకల బీమా (Insurance) ఖర్చులు పెరుగుతున్నాయి. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి, దేశీయ పరిశ్రమలపై మరియు వ్యవసాయ రంగాల పై భారం పడుతుంది.
యుద్ధం వల్ల అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రపంచ పెట్టుబడిదారులు వెనకడుగు వేసే అవకాశం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులకు లోను అవుతుంది. సెన్సెక్స్, నిఫ్టీ వంటి సూచీలు భారీగా పతనమవుతున్నాయి. స్టాక్ మార్కెట్ అనిశ్చితిగా ఉంది. కొన్ని దేశాలు గగనతలం మూసివేయడం తో విమానయాన సంస్థలు తమ రూట్లను మార్చుకోవాల్సి రావడం వల్ల విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటే రీతిలో పెరిగిపోతున్నాయి.
దౌత్యపరంగా భారత్ విపరీతమైన ఒత్తిడి కి గురి అవుతుంది. ఇటు ఇరాన్, నైసర్గికంగా వ్యూహాత్మక భాగస్వామి కాగా, అటు ఇజ్రాయెల్ రక్షణ రంగంలో కీలక మిత్రదేశం. ఈ రెండు దేశాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ రావడం భారత విదేశాంగ శాఖకు ఒక అగ్నిపరీక్ష వంటిదే. ఇవి కాకుండా నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ల అవసరాలను కూడా గమనిస్తూ వారిని చూసుకోవలసిన అవసరం కూడా భారత్ పై ఉంది.
మొత్తంగా చూస్తే, మధ్యప్రాచ్య యుద్ధం అనేది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య గొడవ మాత్రమే కాదు, అది భారత సామాన్యుడి జేబును, దేశ భద్రతను ప్రభావితం చేసే అంశం. మన దేశ అవసరాలకు నష్టం వాటిల్లకుండా, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. రాగల రోజుల్లో ఈ యుద్ధానికి తెర దించుతారని ఆశిద్దాం.
