
“చర్మం” స్పర్శ జ్ఞానాన్ని(Sense of Touch) అందిస్తుంది. ఇది మనిషికి కలిగే మొదటి ఇంద్రియ జ్ఞానం అని, జ్ఞానేంద్రియాలన్నింటికంటే స్పర్శ జ్ఞానం చాలా ముఖ్యమైందని ప్లేటో, అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు పేర్కొన్నారు. శరీరాన్ని పర్యావరణంలోని హానికరమైన అంశాల నుండి రక్షిస్తుంది. నొప్పి, వేడి, చలి వంటి వాటిని ముందుగా గుర్తించి ప్రమాద హెచ్చరికలను మెదడుకు పంపుతుంది.
మానవ శరీరంలోని పంచేంద్రియాలలో స్పర్శ (Touch) అత్యంత కీలకమైనది. కంటికి కనబడకపోయినా, కేవలం తాకడం ద్వారా వస్తువు మెత్తదనాన్ని, వేడిని లేదా బరువును మనం గుర్తించగలం. ఇప్పటివరకు రోబోలు కేవలం కళ్ళు (కెమెరాలు) మరియు చెవులతో (మైక్రోఫోన్లు) మాత్రమే పనిచేసేవి. కానీ ‘టాక్టైల్ సెన్సార్’ (Tactile Sensor) సాంకేతికతతో ఇప్పుడు యంత్రాలకు కూడా అద్భుతమైన స్పర్శ జ్ఞానం లభిస్తోంది. దీనినే శాస్త్రవేత్తలు ‘కృత్రిమ చర్మం’ లేదా ‘ఈ-స్కిన్’ అని పిలుస్తున్నారు.
ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం….. ఈ కృత్రిమ చర్మం కేవలం ఒక ప్లాస్టిక్ పొర కాదు. ఇందులో వేల సంఖ్యలో సూక్ష్మ సెన్సార్లు (Sensels) అమర్చబడి ఉంటాయి. ఇవి వస్తువును తాకినప్పుడు కలిగే ఒత్తిడి (Pressure), ప్రకంపనలు (Vibration) మరియు ఉష్ణోగ్రతను విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. ఈ సంకేతాలను రోబోట్‌లోని కృత్రిమ మేధ (AI) విశ్లేషించి, ఆ వస్తువును ఎంత గట్టిగా పట్టుకోవాలో లేదా అది ప్రమాదకరమైనదా కాదా అని సెకనులో వందో వంతు కాలంలోనే, విశ్లేషించి నిర్ణయిస్తుంది.
భారతదేశం “ఆత్మనిర్భర్ భారత్” లో భాగంగా రక్షణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తుంది. DRDO మరియు DIAT (పుణె) కలిసి సంయుక్తంగా, స్వదేశీ పరిజ్ఞానంతో “టాక్టైల్ సెన్సార్” లను అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా మన దేశం తయారు చేసిన “దక్ష” (Daksh) వంటి “రిమోట్ ఆపరేటెడ్ రోబో” లకు ఈ సెన్సార్లు అమర్చడం వల్ల, అవి బాంబులను అత్యంత సున్నితంగా మనిషి చేతితో పట్టుకున్నట్లే పట్టుకుని నిర్వీర్యం చేయగలవు. ఇవి మన సైనికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి
ప్రస్తుతం ఈ రంగంలో అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొంది. “జపాన్” దేశం మనిషి చర్మం లాగే స్వీయ చికిత్స (Self-healing) చేసుకునే చర్మాన్ని తయారు చేయడంలో ముందుంది. “అమెరికా” కృత్రిమ మేధను జోడించి వస్తువుల ఆకారాన్ని చీకటిలో కూడా గుర్తించే “డిజిటల్ ఫింగర్ టిప్స్” పై దృష్టి పెట్టింది. “చైనా” అతి తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో సెన్సార్లను ఉత్పత్తి చేసే సాంకేతికతను (Mass Production) వృద్ధి చేస్తుండగా, “సింగపూర్” నీటి అడుగున పనిచేసే జెల్లీ ఫిష్ తరహా సెన్సార్లను రూపొందించింది.
యుద్ధం ముగిసినా దశాబ్దాల పాటు భూమిలో, పొంచి ఉండే ల్యాండ్ మైన్స్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. సాధారణ మెటల్ డిటెక్టర్లు లోహాన్ని గుర్తిస్తాయి కానీ, ప్లాస్టిక్ బాడీ ఉన్న మైన్లను గుర్తించలేవు. “టాక్టైల్ సెన్సార్లు” ఉన్న రోబోలు నేలను తాకుతూ వెళ్తున్నప్పుడు, మట్టి కింద ఉన్న వస్తువు యొక్క గట్టిదనాన్ని బట్టి అది “ల్యాండ్ మైన్” అవునా కాదా అని కచ్చితంగా చెప్పగలవు. సముద్ర గర్భంలో (Sea Mines) నాచు పట్టిన “సీ మైన్స్” ను కూడా ఈ స్పర్శ జ్ఞానం ద్వారా గుర్తించడం సులభమవుతుంది.
డైరెక్ట్ కాంటాక్ట్ అవసరమైన చోట “దక్ష” రోబోట్ ఒక “వరప్రసాదం” లాంటిది. ఉదా:- ఒక బ్యాగులో బాంబు ఉందని అనుమానం వస్తే, పాత తరం “రోబో” లు దాన్ని కేవలం లాగగలిగేవి. కానీ “టాక్టైల్ సెన్సార్లు” ఉన్న కొత్త వెర్షన్ “దక్ష” ఆ బ్యాగును, నొక్కి చూసి లోపల ఏముందో అంచనా వేయగలదు. పేలుడు సంభవించే అవకాశం ఉన్నప్పుడు అత్యంత జాగరూకత తో అప్రమత్తంగా వైర్లను కత్తిరించడానికి ఈ సున్నితమైన స్పర్శ అవసరం.
ఈ సాంకేతికత కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు. యుద్ధంలో లేదా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి అమర్చే “స్మార్ట్ కృత్రిమ చేతులకు” (Prosthetic limbs) ఈ సెన్సార్లు అమరుస్తున్నారు. దీనివల్ల ఆ వ్యక్తి కృత్రిమ చేత్తో ఒక గ్లాసు నీటిని పట్టుకున్నప్పుడు, ఆ స్పర్శ మెదడుకు చేరుతుంది. అంటే, మనిషి మళ్లీ పూర్వ స్పర్శను పొందే అవకాశం ఈ టెక్నాలజీ వల్ల కలుగుతోంది.
ఈ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు రోబోటిక్స్ పై అవగాహన పెంచుకోవాలి. సెన్సార్లు ఎక్కువ కాలం మన్నేలా (Durability) తయారు చేయడం, అలాగే వాతావరణ మార్పులను (తేమ, వేడి) తట్టుకునేలా రూపొందించడం ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాళ్లు. వీటిని అధిగమించే సరికొత్త ఆవిష్కరణలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.
రోబోలకు స్పర్శ జ్ఞానం ఇచ్చినప్పుడు, అవి మనుషులపై దాడి చేసే అవకాశం ఉందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు “సురక్షిత ప్రోటోకాల్స్”ను అభివృద్ధి చేస్తున్నారు. రోబో మనిషిని తాకినప్పుడు అది ప్రమాదకరమైన ఒత్తిడి కాదని గుర్తించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. అంటే, స్పర్శ జ్ఞానం అనేది హింస కోసం కాకుండా, సాయం చేయడం కోసమే ఉపయోగపడాలి.
ముగింపు:
“టాక్టైల్ సెన్సార్ల” అభివృద్ధి అనేది మానవ మేధస్సుకు ఒక గీటురాయి. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే చూసిన “సూపర్ రోబోలు” ఇప్పుడు మన కళ్లముందే నిజమవుతున్నాయి. భారతదేశం ఈ దిశగా వేస్తున్న అడుగులు మనల్ని “గ్లోబల్ రోబోటిక్ హబ్” గా మారుస్తాయనడంలో సందేహం లేదు. టెక్నాలజీ అనేది కేవలం మిషన్లు తయారు చేయడం కాదు, అవి మనుషులకు ఎంత దగ్గరగా, సురక్షితంగా పనిచేస్తాయన్నదే ముఖ్యం. ఈ విషయం లో భారత దేశం సాధిస్తున్న ప్రగతి ప్రతి భారతీయుడికి గర్వకారణం.
