హైదరాబాద్‌లోని Panjagutta పోలీసులు యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేశారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సినీనటి Karate Kalyani ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా చర్య తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఫిర్యాదు ప్రకారం, అన్వేష్ సోషల్ మీడియా వేదికల ద్వారా మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధిత వీడియోలు, పోస్టులు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని నిరోధించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇటీవల అన్వేష్ విడుదల చేసిన ఒక వీడియోలో తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సోషల్ మీడియా సంస్థలకు పోలీసులు అధికారిక లేఖ రాసి వివరాలు కోరనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అకౌంట్ కార్యకలాపాలపై పూర్తి సమాచారం సేకరించే ప్రక్రియ ప్రారంభించనున్నారు.
విశాఖపట్నానికి చెందిన అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన సోషల్ మీడియా కార్యకలాపాలపై నెటిజన్లు పెద్ద ఎత్తున రిపోర్టులు చేయడంతో ఇటీవల ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.