
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్యాంప్ కార్యాలయంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) నిర్వాహకులు మాంచో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్డీటీ సంస్థకు ఇటీవల ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) నిబంధనల కారణంగా విదేశీ నిధుల ప్రవాహం నిలిచిపోయిన విషయం తెలిసిందే.
ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కృషికి ఫలితంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన క్లియరెన్స్ లభించడంతో ఆర్డీటీకి ఎదురైన అడ్డంకులు తొలిగాయి.

ఈ నేపథ్యంలో మాంచో ఫెర్రర్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో ఇకపై పేదలకు ఆర్డీటీ సంస్థ ద్వారా నిరాటంకంగా సేవలు అందుతాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
