కన్నడ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘45’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. Shiva Rajkumar, Upendra, Raj B. Shetty ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ‘45’ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, ఈ చిత్ర డిజిటల్ విడుదలకు రంగం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ‘45’ జనవరి 23 నుంచి ZEE5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులు జీ5 వద్ద ఉన్నాయి. అయితే తెలుగు సహా ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రంతో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. కథ విషయానికి వస్తే, ఇది ఆయన వ్యక్తిగత జీవిత అనుభవాల నుంచి పుట్టినదిగా తెలుస్తోంది. కోవిడ్ సమయంలో తన సోదరుడి మరణం అనంతరం కలిగిన ఆలోచనలే ఈ కథకు ప్రేరణగా మారాయని సమాచారం. సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఉండే 45 రోజుల కాలం అత్యంత కీలకమని, ఆ సమయంలో ఆత్మకు పరలోక ప్రయాణమా లేదా పునర్జన్మనా అన్నది నిర్ణయమవుతుందని నమ్మకం. అదే భావనను కథా నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం, థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీ ప్రేక్షకుల్లో మాత్రం మంచి స్పందన అందుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
OTT రిలీజ్ తర్వాత ‘45’కి కొత్త లైఫ్ దొరుకుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలియనుంది.