ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శల్ని దీటుగా తిప్పికొడుతోంది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో డీఎస్సీపై జగన్ అనుసరించిన విధానం, ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియను పోలుస్తూ సహేతుకంగా విమర్శలు ఎక్కుపెట్టింది.
సీఎం కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానంటూ హామీ ఇచ్చిన జగన్, సీఎం అయ్యాక టీచర్ల భర్తీని అటకెక్కించారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చిందని అంటున్నారు తెలుగుదేశం నేతలు.
జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ 5 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో జగన్ ఆడుకున్నారని.. 2024 ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ అంటూ ఊదరగొట్టారని, నోటిఫికేషన్ రిలీజైన 30 రోజుల్లోనే పరీక్షలంటూ మెలిక పెట్టారని దేశం నేతలు విమర్శించారు. చంద్రబాబు హయాంలో 2014-2019 హయంలో 18 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, అత్యథిక సార్లు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత చంద్రబాబుదన్నారు.
గతంలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు కలిపి ఇచ్చి అభ్యర్థుల్ని అయోమయానికి గురిచేశారని, ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టించారని, జగన్ చేసిన తప్పుల్ని గుర్తుచేస్తున్నారు తెలుగుదేశం నేతలు.