రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములపై వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. జిల్లాకో రాజ ప్రాసాదాన్ని నిర్మించడం వైసీపీకి ఇష్టమని, అభివృద్ధి కోసం భూములు కేటాయించడం మాత్రం ఆ పార్టీకి నచ్చదని ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, అది వైసీపీకి నచ్చడం లేదని అంటున్నారు తెలుగుదేశం నేతలు. పరిశ్రమలు, ఐటీ సంస్థల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు రాయితీలు కల్పిస్తుంటే, వైసీపీ పెద్దలు అది చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
తాము జీవిత కాలం శ్రమించినా తీసుకురాలేని సంస్థలను 11 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంటే, వైసీపీ నేతలు కడుపు మండిపోతోందని అంటోంది టీడీపీ. “పెట్టుబడులు వద్దు? కంపెనీలు వద్దు ? ఉద్యోగాలు ఇవ్వొద్దు? అసలు రాష్ట్రమే బాగుపడొద్దు?” అనే ఆలోచనలు చేసే వైసీపీ నేతలు, టీడీపీ చేస్తున్న అభివృద్ధి చూసి జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ఐటీ నగరంగా విశాఖను అభివృద్ధి చేయడంలో బాగంగా టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో పాటు కాపులఉప్పాడలో డేటా సెంటర్ కోసం ఎకరానికి రూ. 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని హిల్ నెం.3లో ఐటీ క్యాంపస్ కోసం ఎకరానికి రూ. 1 కోటి చొప్పున 3.5 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉద్యోగాల సృష్టికి 2 సంవత్సరాల గడువు కూడా ఇచ్చింది. అయితే జిల్లాకో పార్టీ ప్యాలెస్ కట్టుకున్న వైసీపీ నేతలకు రాష్ట్ర యువతకు, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలకు భూములు ఇస్తే మాత్రం ఓర్పుకోలేకపోతున్నారని అంటున్నారు టీడీపీ నేతలు.