“నాదెండ్ల భాస్కరరావు” (1935 జూన్ 23 – 2026 ఏప్రిల్ 22) గుంటూరు లో జన్మించారు. కొంతకాలంగా వయోభారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఈ రోజు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, సీని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాలు, ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా కొనసాగుతున్నారు.
1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అలాగే 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా (MP) ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన హైకోర్టులో విజయవంతమైన న్యాయవాదిగా పనిచేశారు.
నాదెండ్ల భాస్కర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అత్యంత వివాదాస్పద రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌తో కలసి టీడీపీ పార్టీని ఏర్పాటు చేయడంలో కీలకంగా పనిచేశారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 1984 ఆగస్టులో ఎన్.టి. రామారావు (NTR) చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమయంలో, అప్పటి గవర్నర్ రాంలాల్ మరియు కాంగ్రెస్ మద్దతుతో, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి తన వర్గ ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్య మంత్రి గా ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
1984 నుంచి ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెలరోజులపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11వ ముఖ్యమంత్రి గా వ్యవహరించారు. అయితే, ఆయన ఆ పదవిలో కేవలం 31 రోజులు మాత్రమే కొనసాగారు.
ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత “ధర్మయుద్ధం” పేరుతోరాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని నాదెండ్ల భాస్కర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెనువెంటనే అప్పటి గవర్నర్ రాంలాల్‌ను కేంద్రప్రభుత్వం వెనక్కి పిలిపించింది.
తన రాజకీయ ప్రస్థానం మరియు 1984 నాటి పరిణామాల గురించి ఆయన “నా అంతరంగ కథ” (Shashtipoorti) అనే పేరుతో తన ఆత్మకథను కూడా విడుదల చేశారు. కాని ఈయన గురించి తెలిసినవారు, దగ్గరగా చూసినవారు….. ఈయనని మొండివాడిగా, చాలా ధైర్యం కలవాడిగా చెబుతారు. లేకపోతే కేంద్రంలో ఎంత ఇందిరా గాంధీ సపోర్ట్ ఉన్నా, ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ని…. దించాలి అంటే ఈయన కి ఎంత ధైర్యం ఉండాలి అని ఈయన గురించి తెలిసిన ఒక రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం.
కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ జూబిలీహిల్స్ లోని వారి స్వగృహంనందు ఉంచనున్నారు. ఆయన చివరి ఆకాంక్ష మేరకు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.