వార్తలు

ముడి చమురు అన్వేషణలో భారత్…

Published by
Suresh Thota

మనిషి ని రూపాయి గుప్పిట పట్టి ఆడిస్తుంటే… ప్రపంచంలోని అగ్రదేశాల నుండి చిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల వరకు ముడి చమురు తన చుట్టూ తిప్పుకుంటూ ఆడిస్తుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముడి చమురు (Crude Oil) ను కేవలం ఇంధనంగా చూడటం చాలా పెద్ద తప్పు, వాస్తవానికి అది దేశాల ఆర్థిక స్థితిని మాత్రమే కాదు, వారి రాజకీయ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే శక్తివంతమైన ఆయుధం గా మారింది. ముఖ్యంగా ఇరాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, చమురు ధరల మార్పులు మార్కెట్ డిమాండ్ సరఫరా కంటే ఎక్కువగా భౌగోళిక రాజకీయాల అంశాల్లో భారత్లో ముడి చమురు రంగం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్న చమురు నాణ్యతను, ధరను ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం…. ఆయిల్ నాణ్యత ను నిర్ణయించే ప్రధాన ప్రమాణాలు దాని సాంద్రత (Density) మరియు సల్ఫర్ శాతం ఆధారంగా ఉంటుంది. “లైట్ స్వీట్ క్రూడ్” అంటే తక్కువ సాంద్రత, తక్కువ సల్ఫర్ కలిగిన చమురు ఇది పరిశ్రమలకు అత్యంత విలువైనది. ఎందుకంటే దీనిని శుద్ధి చేయడం సులభం, ఖర్చు తక్కువ. అందుకే మలేషియాకు చెందిన “టపిస్”, నైజీరియా యొక్క “బోన్నీ లైట్”, అజర్‌బైజాన్‌కు చెందిన “ఆజెరీ లైట్”, వంటి రకాలు సాధారణంగా బ్రెన్ట్ క్రూడ్ కంటే $1 నుండి $3 వరకు ప్రీమియంతో అమ్ముడవుతాయి.

ప్రపంచ చమురు ధరలకు మూడు ప్రధాన బెంచ్‌మార్క్‌లు ఉన్నాయి. “బ్రెన్ట్ క్రూడ్”, “వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్” (WTI), మరియు “దుబాయ్-ఒమన్”. ప్రస్తుతం “బ్రెన్ట్ క్రూడ్” ఉదా :- సుమారు $90–$100(నిలకడగా ఉండదు కాబట్టి) మధ్య ట్రేడవుతుండగా, WTI సాధారణంగా దానికంటే $4–$6 తక్కువగా ఉంటుంది. నాణ్యత పరంగా WTI మెరుగైనదైనా, రవాణా పరిమితుల వల్ల దీని ధరపై ప్రాంతీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆసియా దేశాలు దుబాయ్-ఒమన్ రకంపై ఆధారపడటానికి కారణం, వారి రిఫైనరీలు “సౌర్ క్రూడ్”ను శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉండటమే.

ఇక్కడే భౌగోళిక రాజకీయాల అసలు ప్రభావం కనిపిస్తుంది. హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో అంతరాయం కలిగితే “బ్రెన్ట్ క్రూడ్” ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అదే సమయంలో అమెరికా తన షెల్ (Shell) ఆయిల్ ఉత్పత్తి, నిల్వలను పెంచడం ద్వారా WTI ధరలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ప్రపంచ మార్కెట్‌లో ధరల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ ప్రభావం చివరకు ద్రవ్యోల్బణం రూపంలో కాని, ధరల పెరుగుదల రూపంలో కాని సాధారణ వినియోగదారుడి మీద పడుతుంది.

ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరో కీలక మార్పు చోటుచేసుకుంది. రష్యాకు చెందిన చమురును “యురల్స్” అంటారు. రష్యా, మరియు ఉక్రెయిన్ యుద్ధ నేపద్యంలో, అమెరికా ఆంక్షలు విధించడం మూలంగా యూరోప్ దేశాలు దిగుమతులు తగ్గించాయి. దాని మూలంగా ముడి చమురు, ఆంక్షల కారణంగా బ్రెన్ట్ క్రూడ్ కంటే $10 నుండి $15 వరకు తక్కువ ధరకు కొన్ని దేశాలకు ఇచ్చింది. సాధారణ పరిస్థితుల్లో ఇది కేవలం $2–$3 తక్కువగా ఉండాలి. కాని ఆంక్షలు వల్ల భారత్ వంటి దేశాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారీగా దిగుమతులు పెంచాయి. దీని వల్ల తాత్కాలికంగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడం, దేశీయ ఇంధన ధరలను నియంత్రించడం సాధ్యమవుతోంది. అయితే దీర్ఘకాలంలో ఇది ఒకే వనరుపై ఆధారపడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మరోవైపు వెస్ట్రన్ కెనడియన్ సెలెక్ట్ (WCS) వంటి హెవీ సౌర్ చమురు, WTI కంటే $15 నుండి $25 తక్కువ ధరకు లభించినా, దాన్ని శుద్ధి చేయడం ఖరీదైన ప్రక్రియ. అదే సమయంలో అమెరికా షెల్ (shell ) ఆయిల్ ఉత్పత్తి పెరగడం వల్ల ప్రపంచ మార్కెట్‌లో సరఫరా సమీకరణాలు మారిపోయాయి. ఫ్రాకింగ్ టెక్నాలజీతో అమెరికా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, సంప్రదాయ చమురు ఉత్పత్తిదారులపై ఒత్తిడి తీసుకొస్తోంది.

ఈ మొత్తం పరిణామాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి ముడి చమురు కేవలం ఒక వస్తువు కాదు, దానిని ఆధారంగా చేసుకుని ఒక వ్యూహం, దాని ద్వారా ఒత్తిడి, లాభనష్టాల సమీకరణతో కూడిన గుత్తాధిపత్యం. ధరలు కేవలం మార్కెట్ సూచికలు కాదు, రాజకీయ నిర్ణయాల వల్ల వచ్చే ఆర్థిక ఫలాలు కూడా.

భారత్ వంటి దేశాలకు ఇక్కడ స్పష్టమైన దిశ అవసరం. తక్కువ ధరల కోసం ఒకే దేశంపై ఆధారపడటం కాకుండా, సరఫరా వనరులను విభిన్నీకరించాలి. అన్ని రకాల చమురును శుద్ధి చేయగలిగేలా రిఫైనరీలను ఆధునీకరించాలి.

అలాగే వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం ద్వారా భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనే సత్తా పెంచుకోవాలి. గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం కదులుతున్నా, వచ్చే దశాబ్దాల పాటు చమురు రాజకీయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగా, ధీటుగా మన నిర్ణయాలు ఉండాలి.

దేశంలో లేదా మన సముద్ర తీరాల లో ముడి చమురు కోసం అన్వేషణ పెంచాలి. ప్రైవేటు రంగంలో కూడా ఆయిల్ అన్వేషిత సంస్థలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం అందించాలి. మన దేశ మేధోసంపత్తిని ఉపయోగించుకునేలా, సరికొత్త ఆవిష్కరణల కోసం విశ్వ విద్యాలయాలను తోడ్పాటు అందించాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.