ఆంధ్ర ప్రదేశ్

వెల్తీ – హెల్తీ – హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది: సీఎం చంద్రబాబు

Published by
Srinivas

“డబ్బు సంపాదనతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా జీవించగలం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

విశాఖలో జరిగిన ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు.

విశాఖను దేశంలోనే ఆదర్శ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ దిశగా పలు పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు.

“సంజీవని” పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, టెక్నాలజీ వినియోగంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఐదు కోట్ల మందికి ఆరోగ్య రికార్డులు సిద్ధం చేస్తున్నామని, ప్రివెంటివ్, క్యూరెటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ విధానంలో వైద్య చికిత్సలు అందించే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను సీఎం వివరించారు. “తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాం. దీపం-2 ద్వారా ప్రతి కుటుంబానికి 3 ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. డ్వాక్రా, మెప్మా సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి” అని చెప్పారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.