
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. తమను ‘ఫేక్’ క్రీడాకారులుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారంటూ స్పోర్ట్స్ కోటా ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 370 మంది స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు పాల్గొని తమ వాదనలను వెల్లడించారు.
‘కెనడాలో సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్ ఆడా.. నన్ను ఫేక్ అంటారా?’
స్పోర్ట్స్ కోటా ఎంపికలపై వస్తున్న ఆరోపణలపై ఎం. జగదీష్ స్పందిస్తూ.. తాను కెనడాలో సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్‌లో పాల్గొన్నానని తెలిపారు. తన క్రీడా ప్రతిభను గుర్తించి ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు.
తనను ఫేక్ క్రీడాకారుడిగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించిన జగదీష్.. తన వద్ద ఉన్న టెట్, క్రీడా ధ్రువపత్రాలను ఎవరైనా పరిశీలించవచ్చని అన్నారు. రాజకీయ ప్రచారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు.
‘కేంద్ర ప్రభుత్వమే రైల్వే, ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఉద్యోగం ఇచ్చింది’
శివనాగిరెడ్డి కూడా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తన క్రీడా ప్రతిభను గుర్తించి రైల్వే, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు. అలాంటి తనను ఫేక్ క్రీడాకారుడిగా పేర్కొనడం సరికాదన్నారు.
తమ క్రీడా రికార్డులు, సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాతే వ్యాఖ్యలు చేయాలని ఆయన కోరారు. తమను అవమానించేలా ప్రచారం చేస్తే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు.

మహిళా క్రీడాకారిణి ఆవేదన
మరో క్రీడాకారిణి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ తరఫున నేషనల్స్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన తనను కూడా ఫేక్ క్రీడాకారిణిగా ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
తాను ఎనిమిదేళ్ల పాటు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశానని, పోస్టల్ శాఖలోనూ ఉద్యోగం వచ్చిందని తెలిపారు. టీచర్‌గా పనిచేయాలనే ఆసక్తితో డీఎస్సీకి హాజరై ఉద్యోగం పొందినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనూ తనకు ఉద్యోగం వచ్చిందని, తన క్రీడా ప్రతిభ, ఉద్యోగ అర్హతలపై అవసరమైన రికార్డులు ఉన్నాయని స్పష్టం చేశారు.
‘క్రీడలను రాజకీయాలకు వేదిక చేయొద్దు’
కులం, మతం, రాజకీయాలకు అతీతంగా టీమ్ స్పిరిట్‌తో రాష్ట్రం, దేశం కోసం క్రీడాకారులు పోటీ పడతారని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. క్రీడల్లో సాధించిన పతకాలు దేశం, రాష్ట్రం గర్వించే అంశాలని, అలాంటి క్రీడా కోటా నియామకాలను రాజకీయ వివాదంగా మార్చడం తమను తీవ్రంగా బాధిస్తోందని అన్నారు.
విజయవాడ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు పి. శివారెడ్డి తాను రాష్ట్రం తరఫున 40 జాతీయ ఖో-ఖో పోటీల్లో పాల్గొన్నానని, దేశం తరఫున మూడుసార్లు స్వర్ణ పతకాలు సాధించానని తెలిపారు. క్రీడాకారుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం 3 శాతం స్పోర్ట్స్ కోటా కల్పించడం భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
‘మూడు టెట్‌లు పాసయ్యాను’
దివ్యాంగ క్రీడాకారులపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని బలగ గణేష్ ఆరోపించారు. తాను ఒక్కటి కాదు, మూడు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. తన అర్హతలను పరిశీలించకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం పొందిన వారిలో పలువురు తమ టెట్ అర్హతలు, క్రీడా ధ్రువపత్రాలు, గతంలో సాధించిన ఉద్యోగాలు, మెడల్స్‌కు సంబంధించిన వివరాలను సమావేశంలో వెల్లడించారు.
370 మంది టీచర్ల సమావేశం
మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై జరుగుతున్న ప్రచారానికి సమాధానం ఇవ్వడంతో పాటు, తమ క్రీడా అర్హతలు, ఎంపిక ప్రక్రియపై తమ వాదనను ప్రజల ముందుంచేందుకే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు అభ్యర్థులు తెలిపారు. దాదాపు 370 మంది స్పోర్ట్స్ కోటా టీచర్లు సమావేశంలో పాల్గొన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
అయితే, ఈ వివాదంపై మరోవైపు అధికారికంగా అభ్యర్థుల అర్హతలను పరిశీలిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఏదైనా సర్టిఫికెట్ నకిలీదని లేదా అర్హత నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
