రాజకీయ వార్తలు

గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత, కాల్పుల్లో ఒకరు మృతి

Published by
Rahul N

కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఫ్లెక్సీలు ఏర్పాటు అంశాన్ని కేంద్రంగా చేసుకుని రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం చివరకు కాల్పుల వరకు వెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే, బళ్లారి నగరంలోని హవంబావి ప్రాంతంలో నిర్వహించనున్న ఒక కార్యక్రమానికి సంబంధించి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఫ్లెక్సీలు తన ఇంటి ప్రహరికి కట్టొద్దని, బయట ఏర్పాటు చేసుకోవాలని మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ విషయమై ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి మరియు గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న గాలి జనార్ధన్ రెడ్డి గన్‌మెన్‌లు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒక గన్‌మెన్ వద్ద ఉన్న తుపాకీని లాక్కొని, సతీష్ రెడ్డి కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డి తీవ్ర గాయాల పాలై మృతి చెందగా, సతీష్ రెడ్డి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు.

కాల్పుల సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆయన, తనపై మరియు తన అనుచరులపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనతో బళ్లారిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పరిస్థితి మరింత చేద్దుగా మారకుండా ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని, ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Rahul N