అంతర్జాతీయం

అడ కత్తెరలో పోక చెక్కలా… పాకిస్థాన్ పరిస్థితి…

Published by
Suresh Thota

అవును…”అడకత్తెరలో పోకచెక్క”లా ఉంది పాకిస్థాన్ పరిస్థితి…. పాకిస్థాన్ ఆర్మీ చీప్ మొన్న జరిగిన ఇఫ్తార్ విందులో షియా ముస్లిమ్స్ ను ఉద్దేశించి ఇరాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళండి అనడంతో పాకిస్థాన్ పరిస్థితి అర్ధం అవుతుంది.

సౌదీ అరేబియా మరియు పాకిస్థాన్‌లు సెప్టెంబర్ 2025లో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం(Strategic Mutual Defence Agreement) పై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒకరి పై జరిగిన దాడిని ఇరువురి పై జరిగిన దాడిగా భావించి, ఉమ్మడిగా ఎదుర్కొనే విదముగా, రెండు దేశాల మధ్య రక్షణ, భద్రతా సంబంధాలను బలోపేతం చేసే విధంగా ఒక కీలక ఒప్పందం జరిగింది.

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే, అది తమపై జరిగినట్లుగా పరిగణించి, పరస్పరం సహాయం చేసుకుంటాయి. ఇది నాటో తరహాలో చేసుకున్న రక్షణ ఒప్పందం. ఈ ఒప్పందం, ముఖ్యంగా ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో, పాకిస్థాన్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ, అవసరమైతే తన అణు సామర్థ్యం తో సౌదీ కి రక్షణ కలిగించే విధంగా భరోసాను ఇస్తూ చేసుకున్న ఒప్పందం.

ఇప్పుడు ఈ ఒప్పందమే పాకిస్తాన్ పాలిట కాల నాగు లా మారింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచి నట్టుగా అయ్యింది. అనుకోని విధంగా ఇరాన్ యుద్ధం రావడం, ఆమెరికా మరియు ఇజ్రాయెల్ కలసి ఇరాన్ మీద పడుతుంటే…. ఇరాన్ గల్ఫ్ దేశాల మీద…. డ్రోన్, క్షిపణులతో దాడి చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో దీని అమలు సవాలుగా మారిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.

మార్చి 2026 నాటి తాజా పరిస్థితుల ప్రకారం, ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మార్చి 23, 2026 న రియాద్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ రక్షణ దళాలు అడ్డుకున్నాయి. దీని ఫలితంగా సౌదీ అరేబియా తమ అగ్రిమెంట్ ను పాకిస్తాన్ కి గుర్తు చేస్తూ, పాకిస్తాన్ ను తమ సపోర్టుగా రావాలని పాకిస్తాన్ పై ఒత్తిడి తెస్తుంది.

పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇటీవల మాట్లాడుతూ, సౌదీపై దాడులు చేయవద్దని ఇరాన్‌ను హెచ్చరించడం గమనార్హం . తమ మధ్య రక్షణ ఒప్పందం ఉందని ఆయన గుర్తుచేశారు. పాక్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ కూడా మార్చి 7న సౌదీ రక్షణ మంత్రితో భేటీ అయి సంయుక్త చర్యలపై చర్చించారు.

ఒకవేళ యుద్ధం తీవ్రమైతే, పాకిస్థాన్ తన సైన్యాన్ని సౌదీకి పంపే అవకాశం ఉంది. అలాగే ఇరాన్ సరిహద్దులో రెండో ఫ్రంట్‌ను తెరవడం లేదా హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో భద్రత కల్పించడం వంటి పనులు చేపట్టవచ్చు. ఇక్కడివరకు పరవాలేదు…. ఒకవేళ పాకిస్తాన్…. ఇరాన్ మీద దాడికి ఉపక్రమిస్తే…. అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు…. అంతర్జాతీయ విశ్లేషకులు…. ఎందుకంటే 5 కోట్ల మంది షియా ముస్లిమ్స్ పాకిస్తాన్ లో ఉన్నారు. దీని మూలంగా పాకిస్తాన్ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

పాకిస్థాన్ వద్ద ఉన్న అణు ఆయుధాలు సౌదీ రక్షణకు ఉపయోగపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇరాన్‌ను నియంత్రించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. కాని, పాకిస్థాన్‌లో ఉన్న ఆర్థిక సంక్షోభం మరియు ఇరాన్‌తో సరిహద్దు పంచుకోవడం వల్ల నేరుగా యుద్ధంలోకి దిగడం పాక్‌కు ప్రస్తుతం చాలా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇంకోపక్క బలూచ్ ఆర్మీ , తో పాకిస్తాన్ కి కంటిమీద కునుకు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఇరాన్ తో కూడా పెట్టుకుంటే పాకిస్తాన్ అల్లకల్లోలం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ ఎక్కువగా “సౌదీ అరేబియా” కి రక్షణ మరియు సాంకేతిక మద్దతు ఇవ్వడానికే మొగ్గు చూపుతోంది. ఒకవేళ సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు లేదా కీలకమైన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు తీవ్రం చేస్తే, పాకిస్థాన్ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఇదే గనుక జరిగితే పాకిస్తాన్ ఆర్మీ లో 3 లక్షల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. వీరంతా షియా ముస్లిం పెద్ద అయిన ఆయూతుల్లా ఖమేని కి పాలోవర్లుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే ఇరాన్ మీద కి దాడి కి పాకిస్తాన్ నాయకత్వం ఆలోచన చేస్తే అది ఏ పరిస్థితి కి దారి తీస్తుందో చెప్పలేము. ఎప్పుడూ విదేశీ వ్యవహారాలను అంచనా వేస్తూ దూరదృష్టి కలవారికి ఇందుకే ఇస్తారు.

సారాంశం: అమెరికా White house లో లంచ్ కి పిలిస్తే వెళ్లిన ఆసిఫ్ మునీర్ కి, అక్కడ “మందు పై చూపే కాని ముందు చూపు లేనట్టు” ఉంది. తానే బలిపీఠం ఎక్కినట్టు ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటుంది.

Suresh Thota