తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన World Economic Forum – 2026 వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని Zurichలో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని ప్రత్యేకంగా సదస్సుకు ఆహ్వానించడం విశేషంగా నిలిచింది.
ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి గారు దావోస్ చేరుకుని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ దీర్ఘకాలిక అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా స్వాగతించారు. ఇటీవల తన కుటుంబ సభ్యులు, మనవళ్లతో కలిసి “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రాన్ని వీక్షించానని, సినిమా ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిత్రంలో అందించిన వినోదం పట్ల తన అభినందనలను ఆయన చిరంజీవి గారితో వ్యక్తిగతంగా పంచుకున్నారు.
స్విట్జర్లాండ్‌లో అనుకోకుండా కలుసుకున్న ఈ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుని, కొంత సమయం ఆహ్లాదంగా గడిపారు. చిరంజీవి గారు కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలోనే ఈ ప్రత్యేక సమావేశం మరియు ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడం జరగడం గమనార్హం.