మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క ఆకస్మికంగా కొనిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి, వసతి సౌకర్యాలు, భోజన నాణ్యత, బోధన ప్రమాణాలపై నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకుగాను ఈ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ చార్జీలను 40 శాతం వరకు పెంచినట్లు తెలిపారు.
భోజనం అనంతరం లైబ్రరీని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, గ్రూప్–1, గ్రూప్–2 వంటి పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా? అవసరమైన అధ్యయన సామగ్రి లైబ్రరీలో అందుబాటులో ఉందా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దోమల నియంత్రణకు సువాసనలతో కూడిన అగరవత్తులు విద్యార్థినీలు తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థినిలు తయారు చేసే అగరవత్తులను బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆదేశించారు. విద్యార్థుల హెల్త్ కార్డుల అంశంపై ప్రశ్నించగా, విద్యార్థుల హెల్త్ యాప్ వివరాలను స్థానిక ప్రిన్సిపల్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు.
చివరగా విద్యార్థినిలు తాము రూపొందించిన పెయింటింగ్‌ను ఉప ముఖ్యమంత్రికి బహుకరించగా, ఆయన గురుకుల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యటనను ముగించారు. ఈ సందర్శన గురుకుల విద్యార్థినుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నిర్వాహకులు తెలిపారు.