సినిమా వార్తలు

అల్లు అర్జున్ చుట్టూ 42 నియమాలా? వైరల్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యలతో నెట్టింట చర్చ

Published by
Srinivas

స్టార్ హీరో Allu Arjun మరోసారి సోషల్ మీడియా చర్చకు కేంద్రంగా మారారు. ముఖ్యంగా Pushpa ఫ్రాంచైజ్ ఘనవిజయం తర్వాత ఆయన పాన్-ఇండియా స్టార్‌గా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఓ వైరల్ పాడ్‌కాస్ట్ క్లిప్ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది.

ఈ క్లిప్ Sweekriti Talks అనే పాడ్‌కాస్ట్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఇందులో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ Kaveri Baruah తన వృత్తి అనుభవాన్ని పంచుకుంటూ అల్లు అర్జున్‌తో జరిగిన ఓ ప్రొఫెషనల్ మీటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె Royal Enfield సంస్థలో బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేశారు.

పాడ్‌కాస్ట్‌లో కావేరి మాట్లాడుతూ, అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు తమ టీమ్‌కు 42 ‘డూ’s అండ్ డోంట్’s ఉన్న ఓ నోట్ ఇచ్చారన్నారు. ఆ నియమాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు. అంతేకాదు, ఈ నియమాలు అమలవుతున్నాయో లేదో చూసేందుకు ‘మేనేజర్‌కి మేనేజర్‌కి మేనేజర్’ అన్నట్లుగా అనేక స్థాయిల్లో మేనేజ్‌మెంట్ ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ఆ నిబంధనల్లో ముఖ్యంగా “అల్లు అర్జున్ కళ్లలోకి నేరుగా చూడకూడదు”, “చేయి కలపకూడదు” వంటి సూచనలు ఉన్నాయని ఆమె చెప్పడం వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఈ నియమాలు ఎందుకు ఉన్నాయన్న ప్రశ్నకు కావేరి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. తనకు కారణం తెలియదని, కేవలం అవి తప్పనిసరి ప్రోటోకాల్స్ అని మాత్రమే చెప్పారని వెల్లడించారు. అలాగే మిగతా నియమాల వివరాలను బయటపెట్టేందుకు ఆమె నిరాకరించడంతో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ క్లిప్ వైరల్ అయిన తర్వాత నెటిజన్ల భిన్నంగా స్పందింస్తున్నారు. కొందరు ఈ వ్యాఖ్యల ఆధారంగా అల్లు అర్జున్‌ను విమర్శించగా, మరికొందరు వాటిని అతిశయోక్తిగా కొట్టిపారేశారు. అల్లు అర్జున్‌ను వ్యక్తిగతంగా కలిసిన అనుభవాలను పంచుకున్న కొంతమంది అభిమానులు, ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉంటారని, తమకు ఎలాంటి ఇబ్బందికరమైన నియమాలు ఎదురుకాలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ గానీ, ఆయన టీమ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ నియమాల నిజానిజాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.