
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ – “ప్రకృతి వైపరీత్యం సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాత్రింబవళ్ళు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ప్రతి జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ” అని అన్నారు.
అలాగే, “ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఇంట్లో కూర్చోలేదు, మీలాగా ఫార్మ్ హౌస్‌లో సేదతీరడం లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో, వరద ప్రాంతాల్లోకి వెళ్లి సహాయం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబానికి తోడుగా నిలుస్తుంది” అని భట్టి దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించిందని, అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారని డిప్యూటీ సీఎం వివరించారు. “ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మీ వెన్నంటి నిలుస్తుంది. కానీ ప్రజల దుస్థితిని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం కేటీఆర్ మానుకోవాలి” అని భట్టి స్పష్టం చేశారు.
