తెలంగాణ

యూరియా కొరతపై రైతాంగం ఆగ్రహం… కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ తుమ్మల లేఖ

Published by
Rahul N

తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ప్రస్తుతం యూరియా కోసం సహకార కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో, రైతాంగం ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా పంటల కీలక దశలో అవసరమైన ఎరువు అందకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ ద్వారా స్పందించారు. ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే యూరియా కొరతకు కారణమని ఆరోపించారు. దేశంలో స్థానిక ఉత్పత్తిని పెంచకపోవడం, అలాగే విదేశాల నుంచి సకాలంలో యూరియా దిగుమతి చేయకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని మంత్రి విమర్శించారు.

తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం రాష్ట్రాలపై నిందలు వేస్తోందని, దీనిలో బీఆర్‌ఎస్‌ కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ఒత్తిడి ఫలితంగా వచ్చే వారం రోజుల్లోనే తెలంగాణకు 35 వేల టన్నుల యూరియా రానుందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇస్తూ, రైతులు కలవరపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పంటల దశలో ఎరువు కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు కేంద్రం, రాష్ట్రం మధ్య నిందల రాజకీయాలు కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.

Rahul N

Recent Posts