
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చార్మింగ్ స్టార్ శర్వా.. ఇప్పుడు ‘భోగి’ సినిమాతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్ర బృందం తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా విడుదల చేసిన ‘ఎగిలివరంగ’ పాట ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పల్లె వాతావరణం.. తెలంగాణ మట్టి వాసన!
1960ల నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమా మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దులోని బొగ్గుల గుట్ట అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ కాలం నాటి గ్రామీణ జీవనశైలి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ‘ఏగిలివారంగ’ పాటను రూపొందించారు. పల్లెటూరి వాతావరణాన్ని సహజంగా చూపిస్తూ, అప్పటి ప్రజల జీవన విధానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
ఫోక్ సాంగ్స్‌ను తనదైన శైలిలో రూపొందించే భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సంగీతం అందించారు. పాట ప్రారంభం నుంచి చివరి వరకు క్రమంగా పెరుగుతూ వెళ్లే జోష్, సంగీతంలోని వైవిధ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. వినడానికి మాత్రమే కాకుండా, కథా నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ పాట ఉపయోగపడేలా ఉంది.
చంద్రబోస్ కలం.. జానపద గాయకుల గొంతు!
ఆస్కార్ విజేత గీత రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. సహజమైన తెలంగాణ యాసలో రాసిన పదాలు అప్పటి గ్రామీణ సమాజాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరిస్తున్నాయి. కులవృత్తులు, గ్రామీణ సంప్రదాయాలు, స్థానిక భూస్వాముల ఆధిపత్యం వంటి అంశాలను పాటలో ప్రతిబింబించారు.
నల్గొండ గద్దర్ నర్సన్న తన శక్తివంతమైన గాత్రంతో పాటకు అసలైన పల్లెదనాన్ని తీసుకొచ్చారు. నర్సిరెడ్డి, కందుకూరి శంకర్ బాబు, రిలారే గోపాల్ తమ గొంతులతో పాటకు మరింత జానపద కళను అద్దారు. సంగీతం, సాహిత్యం కలిసిన తీరు పాటకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.

పల్లెటూరి యువకుడిగా శర్వా.. ఆకట్టుకుంటున్న అనుపమ!
‘ఏగిలివారంగ’ పాటలో శర్వా, అనుపమ పరమేశ్వరన్ తమ పల్లెటూరి పాత్రల్లో సహజంగా కనిపిస్తున్నారు. ఆ కాలానికి తగిన దుస్తులు, గ్రామీణ వాతావరణం, స్థానిక జీవనశైలిని ప్రతిబింబించే దృశ్యాలు పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ పీరియడ్ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా చిత్ర బృందం జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
దర్శకుడు సంపత్ నంది ఈసారి తెలంగాణ ప్రాంతపు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను కథలో కీలకంగా మేళవించినట్లు పాటను చూస్తే అర్థమవుతోంది. సాధారణ కమర్షియల్ పాటలా కాకుండా, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే విధంగా ‘ఎగిలివరంగ’ను రూపొందించడం విశేషం.
భారీ స్థాయిలో ‘భోగి’.. విడుదల తేదీపై ఆసక్తి!
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. శర్వా, అనుపమ పరమేశ్వరన్‌లతో పాటు డింపుల్ హయాతి మరో కథానాయికగా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను కిషోర్ కుమార్ నిర్వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా నిర్మాణంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. టీజర్‌తో ఆసక్తి పెంచిన ‘భోగి’, ఇప్పుడు పల్లె పాటతోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాతో శర్వా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
