సినిమా వార్తలు

మళ్లీ వివాదంలో చిక్కుకున్న నటి డింపుల్ హయతి…

Published by
Rahul N

రవితేజ సరసన ‘ఖిలాడీ’, గోపీచంద్ హీరోగా వచ్చిన ‘రామబాణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయతి మళ్లీ వివాదంలో చిక్కుకుంది. గృహ సహాయకులకి వేతనాలు చెల్లించకపోవడమే కాకుండా వారిని అవమానించారన్న ఆరోపణలు ఆమెపై వస్తున్నాయి. ఈ విషయంపై మీడియాలో వచ్చిన కథనాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

డింపుల్ హయాతి గతంలోనూ ఇలాంటి వివాదాల్లో వార్తల్లోకి వచ్చారు. ఆమె, 2023లో హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఐపీఎస్ అధికారితో తలెత్తిన వివాదం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరొక కొత్త సమస్యతో ఆమె పేరు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

తెలిసిన సమాచారం ప్రకారం, డింపుల్ హయతి తన లివ్–ఇన్ భాగస్వామితో కలిసి నివసించే ఇంట్లో కుక్కల సంరక్షణ కోసం ఒడిశా రాష్ట్రానికి చెందిన కొంతమంది యువతులను పనికి తీసుకున్నారు. అయితే వారికి తగిన వేతనం ఇవ్వలేదని, బకాయిల గురించి అడగగా ఆమె భాగస్వామి దురుసుగా, అసభ్య పదజాలంతో మాట్లాడాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక, డింపుల్ స్వయంగా వారిని బెదిరించారని సంబంధిత మహిళలు మీడియాకు వివరించారు.

ఈ ఆరోపణలపై ఇప్పటివరకు డింపుల్ హయతి నుండి ఎటువంటి స్పందన లేదు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఆమె నటుడు శర్వానంద్ సరసన ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ నటి మీద ఆరోపణలు రావడంతో, ఈ విషయం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

Rahul N