చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘ఘాటీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క శెట్టి, ప్రస్తుతం మరో నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. గంజాయి సాగు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా పెద్దగా ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది.
ఇలాంటి సమయంలోనే అనుష్క తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక ప్రకటన చేసింది. “ట్రేడింగ్ బ్లూ లైట్ టు క్యాండిల్‌లైట్… కొన్నాళ్ల పాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి, స్క్రోలింగ్ నుంచి కొంత విరామం కావాలి. నేను మొదలైన చోటికే తిరిగి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పేర్కొంది.
తన యోగా జీవనశైలిని కొనసాగించాలనే సంకేతాలు ఇస్తూ, “త్వరలోనే మరిన్ని కథలతో మిమ్మల్ని కలవబోతున్నాను. ఎల్లప్పుడూ మీ ప్రేమలోనే ఉంటాను” అని అభిమానులకు లేఖరూపంలో సందేశం ఇచ్చింది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటీ’ చిత్రంలో అనుష్క శీలావతి పాత్రలో కనిపించింది. విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, చైతన్య రావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.