చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో అరెస్ట్ అయి, జైళ్లో ఉన్న పోసానికి బెయిల్ లభించింది. ఉమ్మడి కడప జిల్లాలోని ఓబులరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ ఇచ్చింది మొబైల్ కోర్టు. ఈ సందర్భంగా కస్టడీ కోరిన పోలీసుల పిటిషన్ ను తిరస్కరించింది.
మరోవైపు పల్నాడు జిల్లా నరసారావు పేటలో పోసానిపై నమోదైన కేసుకు సంబంధించి మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. పోసానిని 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో శని, ఆదివారాలు పోసానిని విచారించబోతున్నారు పోలీసులు.
అయితే పోసానికి ఓ చిన్న మినహాయింపు ఇచ్చింది కోర్టు. ఆయన కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ప్రస్తుతం పోసానిపై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో 17 కేసులు నమోదయ్యాయి.
ఆయనపై పీటీ వారెంట్లు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే పోసానికి ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో ఆయన పోలీస్ స్టేషన్ లో గడపాల్సి రావొచ్చు.