ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముసుగులో కరడుగట్టిన నేరస్తులున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వివేక హత్య కేసు నుంచి జరిగిన పరిణామాలపై మంత్రులతో చర్చించారు బాబు. తన స్వలాభం కోసం జగన్, రాజకీయాల్ని నేరమయం చేశారని ఆరోపించారు.
వివేక హత్య కేసులో జగన్ ఎలా వ్యవహరించారో ఘటనలతో సహా వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముందు గుండె పోటు అన్నారని, ఆ తర్వాత గొడ్డలి వేటు అన్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి, అధికారంలో ఉన్నప్పుడు వద్దన్నారని అన్నారు.
వివేక హత్య కేసుకు సంబంధించి కీలక సాక్షి వాచ్ మేన్ రంగన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి అనుమానాస్పదంగా ఉందన్నారు చంద్రబాబు. కేసు సీబీఐ పరిథిలో ఉన్నప్పటికీ, సాక్ష్యుల్ని రక్షించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందన్నారు.
జగన్ చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా ఆయన వైఖరి ఉందని, ఆయన మాయలో పడొద్దని అన్నారు.