బాలీవుడ్‌లో తన గ్లామర్, మోడలింగ్ కెరీర్, సినిమాలతోనే కాదు, టాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఉర్వశి రౌటేలా (Urvashi Rautela). స్పెషల్ సాంగ్స్, ఐటమ్ నంబర్లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్, రామ్ పోతినేని స్కంద మరియు అఖిల్ ఏజెంట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు.
కాగా, ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో మరోసారి సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఉర్వశి రౌటేలాకి Enforcement Directorate (ED) సమన్లు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా బలంగా విస్తరించిందని, ఈ ప్లాట్‌ఫార్ముల ద్వారా భారీగా మనీ లాండరింగ్ జరుగుతోందని ఈడీ అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ లాంటి వారు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ముంబైలో నివసిస్తున్న ఉర్వశి రౌటేలా, సెప్టెంబర్ 16న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.
ఉర్వశి రౌటేలా పేరు ఈడీ దర్యాప్తులో చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారణకు హాజరుకావడం, ఇప్పుడు బాలీవుడ్ స్టార్‌ల వరకూ ఈ లిస్టు చేరడం పరిశ్రమలో పెద్ద కలకలంగా మారింది.