వార్తలు

సముద్ర వాణిజ్యాన్ని గుప్పిట పట్టాలని భారత్ వేస్తున్న మొదట అడుగు…

Published by
Suresh Thota

“విజయం అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు, ఆ ప్రయాణానికి మొదటి అడుగే అత్యంత కీలకమైనది.” ఇప్పుడు భారత్ చేస్తున్నది ఇదే. వేల కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం భారత్ బలం.

భారతదేశం తన సముద్ర రవాణా రంగాన్ని బలోపేతం చేసే దిశగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను 62 కొత్త నౌకలను సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్ నేతృత్వంలో ప్రకటించిన ఈ ₹51,383 కోట్ల ప్రణాళికపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది ఒక భారీ ముందడుగు లా కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే ఇది కేవలం సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే…

ప్రస్తుతం భారత వాణిజ్యంలో అత్యధిక భాగం విదేశీ నౌకల ద్వారానే జరుగుతోంది. ముడి చమురు దిగుమతుల నుంచి ఎగుమతుల వరకు మనం ఇతరులపై ఆధారపడటం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం “షిప్పింగ్ చార్జీల” రూపంలో దేశం దాటి వెళ్తోంది. ఇది మనకు కేవలం ఆర్థిక నష్టమే కాదు, వ్యూహాత్మక ముప్పు కూడా, అంతర్జాతీయంగా “స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్” వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, విదేశీ నౌకలపై ఆధారపడటం దేశ భద్రతకే ప్రమాదం. ఈ నేపథ్యంలో, సొంత నౌకాదళాన్ని పెంచుకోవడం ద్వారా భారత్ తన రవాణా శక్తిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

భారత దేశం ​ప్రకటించిన ₹51,383 కోట్ల బడ్జెట్‌ను 62 నౌకలతో విభజిస్తే, సగటున ఒక్కో నౌకకు ₹828 కోట్ల ఖర్చు అవుతుందని తేలుతుంది. అయితే, దీన్ని కేవలం ఒక్కో నౌక ధరగా పరిగణించలేం ఎందుకంటే….. ఈ విస్తరణలో భాగంగా “కంటైనర్ షిప్‌”లు, “LPG కెరియర్లు”, “ముడి చమురు ట్యాంకర్లు”, “డ్రెడ్జింగ్ నౌక”లు మరియు పర్యావరణ హితమైన “గ్రీన్ టగ్స్” ను అభివృద్ధి చేస్తారు. ఇవి తయారీకి ఒక్కో నౌక ఒక్కోరేటును కలిగిఉంటుంది.

“గ్రీన్ టగ్స్” అంటే పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాలతో పనిచేసే చిన్న ఓడలు (Tugboats). ఇవి తొందరలోనే ఎలెక్ట్రిక్, హైడ్రోజన్, ఆధారంగా, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ద బోతున్నారు. సాధారణంగా ఓడరేవుల్లో (Ports) భారీ నౌకలు వచ్చినప్పుడు, అవి సొంతంగా కదలడం కష్టమవుతుంది. అప్పుడు ఈ చిన్న “టగ్ బోట్లు” వాటిని నెట్టడం లేదా లాగడం ద్వారా సరైన చోటికి చేరుస్తాయి. “మేక్ ఇన్ ఇండియా” లో భాగంగా 2030 నాటికి భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో ఉన్న “టగ్ బోట్ల” లో కనీసం 50% “గ్రీన్ టగ్స్‌”గా మార్చాలి అనే లక్ష్యం పెట్టుకుంది.

ఈ బడ్జెట్‌లో కేవలం కొనుగోలు మాత్రమే కాకుండా, నౌకల నిర్వహణ, పోర్ట్ మౌలిక వసతులు మరియు ఇతర ఆర్థిక రాయితీలు కూడా అంతర్భాగంగా ఉండే అవకాశం ఉంది. భారత్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (JNPT) వంటి ప్రధాన ఓడరేవులు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సామర్థ్యం మరియు వేగం విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు ఇంకా దూరంగానే ఉన్నాయి. పోర్టులలో సరుకు లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలు మందకొడిగా ఉంటే, నౌకల సంఖ్య పెరిగినా ఆశించిన ఫలితం ఉండదు. వ్యాపారులు ఎప్పుడూ ఖర్చు తక్కువగా, వేగంగా సేవలు అందించే Maersk లేదా MSC వంటి దిగ్గజ కంపెనీల వైపు మొగ్గు చూపుతారు. అందుకే “షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” మరియు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఇటువంటి విషయాల మీద దృష్టి సారించాలని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం వద్ద అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే పెద్ద నౌకలు సుమారు 1,500 వరకు ఉన్నాయి. చిన్న నౌకలను కలిపితే ఈ సంఖ్య 3,000 లోపే ఉంటుంది. కానీ మన పొరుగు దేశం చైనాతో పోల్చినప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. చైనా వద్ద అంతర్జాతీయ వాణిజ్యానికి ఉపయోగపడే నౌకలే 7,000 వరకు ఉండగా, మొత్తం నౌకల సంఖ్య 10,000 దాటుతుంది. చైనా కేవలం నౌకలను కొనుగోలు చేయడం లేదు, వాటిని స్వదేశీయంగా నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

​భారత్ ప్రస్తుతం తన వాణిజ్యంలో అత్యధిక భాగం విదేశీ నౌకలపైనే ఆధారపడుతోంది. ఇది సాధారణ సమయాల్లో కేవలం ఆర్థిక భారం (ఫ్రైట్ చార్జీలు) మాత్రమే కావచ్చు, కానీ అంతర్జాతీయ సంక్షోభాలు లేదా యుద్ధ సమయాల్లో “సప్లయ్ చైన్” (Supply Chain) దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. అది మన దేశ ఆర్థిక ప్రగతికి గొడ్డలిపెట్టు. (ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చమురు పరిస్థితులు)

కేవలం నౌకల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే భారత్ “సముద్ర శక్తి”గా మారలేదు. ​పోర్టుల సామర్థ్యం ను మెరుగుపరచుకోవాలి, ముంబైలోని JNPT వంటి పోర్టులు అభివృద్ధి చెందుతున్నా, షాంఘై వంటి గ్లోబల్ పోర్టుల వేగంతో పోలిస్తే మనం వెనుకబడే ఉన్నాం. పోర్టులు స్లోగా ఉంటే నౌకలు పెరిగినా ప్రయోజనం ఉండదు. “స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్” వంటి సున్నితమైన ప్రాంతాల్లో అంతరాయం కలిగితే, మన సొంత నౌకలు లేకపోవడం దేశ భద్రతకే ముప్పు. దీని వల్ల ఆర్థిక భారం కూడా, అనుభవం తో కూడిన, నైపుణ్యం కలిగిన సిబ్బంది ని తయారు చేసుకోవాలి.

భారతదేశం తన సముద్ర వాణిజ్యంలో కనీసం 50 నుంచి 60 శాతం స్వంత నౌకల ద్వారా నిర్వహించే స్థాయికి చేరాలి. ఆ లక్ష్యాన్ని చేరాలంటే మనకు కనీసం 4,000 నుండి 5,000 అంతర్జాతీయ స్థాయి నౌకలు అవసరం. ప్రస్తుతం ప్రకటించిన 62 నౌకలు మన మొత్తం అవసరంలో కేవలం 2-3 శాతం పెరుగుదలను మాత్రమే సూచిస్తాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ 62 నౌకల ప్రణాళికను తక్కువగా చూడలేం, ఎందుకంటే ఇది సరైన దిశలో వేసిన ముందడుగు. అయితే, దీన్ని అతిశయోక్తిగా చూడటం కూడా పొరపాటే. ఇది ఒక శుభారంభం మాత్రమే.

ముగింపు: “వేల మైళ్ల ప్రయాణమైనా మొదటి అడుగుతోనే మొదలవుతుంది” స్వాతంత్ర్యం తర్వాత నౌక రంగంలో వేస్తున్న భారీ ముందడుగు ఇది.

భారత్ నిజంగా గ్లోబల్ షిప్పింగ్ హబ్‌గా మారాలంటే, నౌకల సంఖ్య పెంచడంతో పాటు, నౌకల నిర్మాణ రంగం (Ship building), పోర్ట్ ఆధునీకరణ మరియు లాజిస్టిక్స్ వ్యవస్థను సమూలంగా మార్చాలి. అప్పుడే మనం సముద్రాలపై మన ఆధిపత్యాన్ని చాటుకోగలం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.