సినిమా వార్తలు

గెటప్ శ్రీను – జాఫర్ ఇంటర్వ్యూలో ఉద్రిక్తత… మధ్యలోనే వాక్‌అవుట్!

Published by
Srinivas

ప్రముఖ హాస్య నటుడు గెటప్ శ్రీను ఇటీవల జర్నలిస్ట్ జాఫర్ తో నిర్వహించిన వ్యక్తిగత ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదా చర్చలతో సాఫీగా సాగినట్లు తెలుస్తోంది. కెరీర్, వ్యక్తిగత అనుభవాలు, ఇండస్ట్రీలో ప్రయాణం వంటి అంశాలపై ఇద్దరూ సాధారణంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లినట్లు సమాచారం. గెటప్ శ్రీను, నాగబాబు కలిసి నటిస్తున్న సిరీస్‌కు ‘మేము కాపులం’ అనే టైటిల్ పెట్టడం పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూ క్రమంగా వ్యక్తిగత విషయాల వైపు మళ్లిన సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారినట్లు తెలుస్తోంది.

ఇంటర్వ్యూలో భాగంగా జాఫర్ అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ గెటప్ శ్రీను చేసిన వ్యాఖ్య వివాదానికి కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యాఖ్యపై జాఫర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. మొదట సాధారణ చర్చలా కనిపించిన ఈ భేదాలు క్రమంగా మాటామాటాగా మారి వాగ్వాదానికి దారితీసినట్లు తెలుస్తోంది.

సంభాషణ వేడెక్కిన క్రమంలో గెటప్ శ్రీను అసహనం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూను కొనసాగించలేనని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. “ఈ తొక్కలో ఇంటర్వ్యూ నేను చేయను” అని, ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని చెబుతున్నారు. షూటింగ్ సెట్లో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. మరోవైపు, గెటప్ శ్రీను వెళ్లిపోయిన తరువాత జాఫర్ తన వైపు నుంచి తాను అడిగిన ప్రశ్నలో తప్పేమీ లేదని, ఎందుకు అంతగా సీరియస్ అవ్వాల్సి వచ్చిందో తనకు అర్థం కాలేదని అన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం పరిమితంగానే ఉండటంతో అసలు వివాదానికి కారణమైన ప్రశ్న ఏమిటి? వ్యాఖ్యల పూర్తి సందర్భం ఏమిటి? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. పూర్తి వీడియో బయటకు వస్తే మాత్రమే ఈ సంఘటనపై నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు గెటప్ శ్రీను రియాక్షన్‌ను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ఓవర్ రియాక్షన్ అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా చర్చిస్తున్నారు.

ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది — ఇది నిజంగానే జరిగిన ఘర్షణా? లేకపోతే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు చేసిన పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా?…. పూర్తి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టమైన సమాధానం దొరకనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.