రిలీజ్ కి పట్టుమని 3 రోజులు కూడా లేదు. నిన్ననే వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది హైద్రాబాద్లో. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరై సినిమాకున్న హైప్ ని పెంచేశారు.
అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని వివాదానికి దారితీసింది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రధానంగా కన్నడలోనే ప్రసంగించటం కొంతమంది తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. పాన్ ఇండియా రిలీజ్‌గా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాలో తెలుగు అభిమానులను పట్టించుకోలేదన్న భావనతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ట్విట్టర్ #BoycottKantaraChapter1 ట్రెండ్ అవుతోంది.
ఈవెంట్ పూర్తయిన కేవలం కొన్ని గంటల్లోనే #BoycottKantaraChapter1 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతూ 25 వేలకుపైగా మెన్షన్లను దాటింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెరిగిన టికెట్ రేట్లు, గతంలో కర్ణాటకలో తెలుగు సినిమాల ఈవెంట్లకు ఎదురైన ఇబ్బందులను గుర్తుచేస్తూ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే ఈ ఈవెంట్‌లో సరదా క్షణాలు కూడా లేకపోలేదు. రిషబ్ శెట్టి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య కనిపించిన అనుబంధం అభిమానుల్లో చప్పట్లను రేపింది. శెట్టి అభిమానులు మాత్రం ఆయన కన్నడలో మాట్లాడటాన్ని తన మూలాలకు గర్వంగా ఉన్నట్టు భావించాలి కానీ సినిమాకి ఉన్న పాన్ ఇండియా అట్రాక్షన్‌ని దానితో పోల్చకూడదని వాదిస్తున్నారు.
అయితే ‘బాయికాట్ కాంతార: చాప్టర్ 1’ ట్రెండ్ అవడానికి రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడమే కారణమా ? లేక ఇంకేమైనా ఉందా అని నెటిజన్లు లోతుగా విశ్లేషిస్తున్నారు.
అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న కాంతార: చాప్టర్ 1 పై తెలుగు రాష్ట్రాల్లో బాయికాట్ పిలుపులు బాక్సాఫీస్ రిజల్ట్‌పై ప్రభావం చూపుతాయా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.