
విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం డాక్టర్ శరణి రచించిన “మైండ్‌సెట్ షిఫ్ట్” పుస్తకావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “బలమైన అంకితభావం, సానుకూల ఆలోచనలు విజయం సాధించడానికి కీలకం. చిరంజీవిగారు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. సినిమా నేపథ్యం లేకుండా, కేవలం తన సంకల్పంతో గొప్ప శిఖరాలను అధిరోహించారు. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత, ఆ ఖాళీని చిరంజీవి గారు తన కృషి, నటనా ప్రతిభతో భర్తీ చేశారు,” అని ప్రశంసించారు.

అలాగే, చిరంజీవి గారి సామాజిక సేవా రంగంలో తీసుకున్న ముందడుగును కూడా సీఎం ప్రశంసించారు.
“చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కోసం నన్ను భూమి కేటాయించమని కోరిన దృఢ సంకల్పాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాను. సినిమా నటులుగా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను తన పైన వేసుకున్న తొలి నటుడిగా చిరంజీవి గారు నిలిచారు. ఇది చాలా అరుదైన విషయం,” అని అన్నారు.
చిరంజీవి తన ప్రసంగంలో, “కష్టపడటం ఒక్కటే కాదు, తెలివిగా పనిచేయడమే విజయాన్ని నిర్దేశిస్తుంది. నాకు కెరీర్‌పై స్పష్టత లేకపోయిన రోజుల్లో కూడా నటనపై ఉన్న మక్కువే నాకు మార్గం చూపింది. ప్రతి పాత్రను నిజాయితీగా చేశాను. అదే నా విజయంలో కీలకమైంది,” అన్నారు.

అలాగే, తల్లిదండ్రుల మద్దతుతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు ICWAI కోర్సు చేసి, రెండింటిని సమతుల్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకున్నారు.
“ఉంటే సినిమాల్లో ఉండాలి, లేకుంటే ఎక్కడా ఉండొద్దు” అన్న నమ్మకంతోనే ఎదిగానన్నారు. విజయం అంటే కేవలం ప్రతిభ కాదని, నిజాయితీ, వినయం, విలువలు కలిస్తేనే శాశ్వత గౌరవం దక్కుతుందని చెప్పారు.

చివరగా, జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేస్తూ, “మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా సానుభూతి. మృతుల కుటుంబాలకు మద్దతు తెలిపిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్‌లకు నా అభినందనలు,” అన్నారు. అనంతరం అమరులకు మౌనంగా నివాళి అర్పించారు.
డాక్టర్ శరణి రచించిన “మైండ్‌సెట్ షిఫ్ట్” పుస్తకం వ్యక్తిత్వ వికాసం, అభివృద్ధి, విజయానికి అవసరమైన మనోభావాలపై కసరత్తు చేసేలా ఉండి, కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
