
అవును నిజమే మీరు చదివినది…. ప్రతి నోటా ఇదే మాట 1988 లో వచ్చిన యముడికి మొగుడు చిత్రం చూసిన ప్రతివాళ్ళు…. సరదాగా అనేవారు. చిరంజీవి చిన్నప్పుడు స్ప్రింగ్ (spring) లు మింగి ఉంటాడు అని, తెలుగు సినిమా పాట కి వేగం పెంచినది చిరంజీవి ఈ చిత్రం తోనే….. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మితమై, 14 కోట్ల నెట్ కలెక్షన్స్ తో అత్యధిక వసూళ్లు రాబట్టి చిరంజీవి ఇమేజ్ ను ఎవరూ కదిలించలేని స్థాయి కి తీసుకువచ్చిన చిత్రం “యముడికి మొగుడు”.
తెలుగు ప్రేక్షకులకు యముడికి ఏదో బంధం, అనుబంధం ఉంది . యముడి మీద వచ్చిన సోషియో ఫేంటసీ సినిమాలన్నీ నిర్మాతలకు కనక వర్షం కురిపించాయి . 1960 లో యన్టీఆర్ , కృష్ణకుమారి , యస్వీఆర్లతో “దేవాంతకుడు” వచ్చింది . 1977 లో యన్టీఆర్ , జయప్రద , సత్యనారాయణ , అల్లు రామలింగయ్యలతో వచ్చిన “యమగోల” తెలుగు నాట ఆడియో రికార్డ్స్ రూపంలో ప్రతి ఇంటా నవ్వులు పూయించాయి. “యముడికి మొగుడు” 1988లో విడుదలై చిరంజీవి ఇమేజ్ ను మేరు పర్వత శిఖరానికి జేర్చింది. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. “యమలీల” 1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన హాస్యరస ప్రధానమైన చిత్రం.
2007 లో “యమదొంగ” టైటిలుతో జూనియర్ యన్టీఆర్ , ప్రియమణి , మమతా మోహన్ దాస్ , మోహన్ బాబు , ఖుష్బూ , బ్రహ్మానందంలతో వచ్చిన సినిమా మరో బ్లాక్ బస్టర్ . 2012 అల్లరి నరేష్ , రిచా , సయాజీ షిండే , రమ్యకృష్ణలతో వచ్చిన మరో “యముడికి మొగుడు” బాగానే ఆడింది .
ఇంక ఈ “చిరంజీవి” సినిమా “యముడికి మొగుడు” తో ఆంధ్ర ప్రదేశ్ దద్దరిల్లింది. తన మిత్రులు నారాయణరావు , సుధాకర్ , హరిప్రసాదుల కోసం చిరంజీవి నటించిన ఈ “యముడికి మొగుడు” చిత్రాన్ని, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “డైనమిక్ మూవీ మేకర్స్” పతాకం పై నిర్మించారు. బ్లాక్ బస్టర్ అయిన సినిమా మొత్తంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా తల తిప్పనివ్వదు. పక్కకు తిప్పితే ఏ డైలాగ్ మిస్ అవుతామో అన్నట్టుగా మన దృష్టి మరల్చనీయదు. 29/04/1988 తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న చిత్ర రాజం… ఈ యముడికి మొగుడు. 38 వసంతాలు పూర్తి చేసుకుంది.
సత్యానంద్,నారాయణరావు, రవిరాజా పినిశెట్టిలు కలిసి నేసిన కధ అద్భుతంగా వచ్చింది. మాటలు తో సత్యానంద్ ప్రాణ వాయువు అందించారు. కధకు, చిరంజీవి స్టార్డంకు తగ్గట్లే బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. నిర్మాతలు, పంపిణీ దారులు నుండి సైకిల్ స్టాండ్ పాట పాడుకునే వాళ్ళ వరకు…. ఆ వేసవి మొత్తం పన్నీటి జల్లుల తో కూడిన కనక వర్షం తో తడిసిపోయారు.
రాజ్-కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . బ్రహ్మాండమైన చిత్రీకరణ . వేటూరి వారు పాటల్ని వ్రాస్తే బాలసుబ్రమణ్యం , సుశీల , జానకమ్మ , మనోలు అత్యంత శ్రావ్యంగా పాడారు . “అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం” బెంగుళూరు ప్యాలెస్ ప్రాంగణంలో చిత్రీకరించబడిన ఈ డ్యూయెట్టు చిరంజీవి , రాధలు అదరగొట్టేసారు .
సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో చిరంజీవి ఒకేసారి డాన్స్ చేస్తాడు “కన్నెపిల్లతోటి పిల్లగాడికొచ్చెనమ్మ పీకులాట” పాటలో రాధ, విజయ శాంతి డాన్స్ తో పాటు విచిత్రగుప్తుని మేజిక్ అద్భుతం. చిరంజీవి విజయశాంతిల మీద వాన పాట చాలా హాటు, హాటుగా ఉంటుంది . “వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా నీటిముళ్ళే గుచ్చుకుంటే ఎట్టాగమ్మా” అంటూ సాహిత్యం తో విజృంభిస్తుంది వేటూరి వారి కలం.
వీళ్ళిద్దరి మీదే మరో డ్యూయెట్ “ఎక్కూ బండెక్కు మావా ఎక్కి లాగించు మావా” అంటూ కాస్త ద్వంద్వర్ధముల తో సాగుతుంది ఈ పాట . చిరంజీవి , రాధల మీద డ్యూయెట్ “బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా” బాగుంటుంది . ఈ అన్ని పాటలకు నృత్య దర్శకురాలు తారే .
యమలోకంలో రంభతో సాగే రీమిక్స్ పాట… నో నో నో నో నో నాట్య మీదా. పాటకు, సంగీతానికి, చిరంజీవి డాన్స్ చూసి తీరవలసిందే… చాలా బాగా కంపోజ్ చేసారు. ఈ పాటలో చిరంజీవి , అంబిక నటించారు . అంబిక అంటే రాధ అక్క .
ద్విపాత్రాభినయం చేస్తూ చిరంజీవి బ్రహ్మాండంగా నటించారు . రాధ , విజయశాంతి ఇద్దరూ చాలా గ్లామరస్ గా నటించారు . ముఖ్యంగా పాటల్లో . క్లైమాక్సులో యముడు ఏదో సలహా ఇస్తాడు . చిరంజీవి వాళ్ళిద్దరి చెవుల్లో ఏదో ఉపదేశిస్తాడు . ఇద్దరూ ఒకే అంటూ గుండె మీద వాలిపోవటంతో ప్రేక్షకుడు నవ్వుకుంటూ బయటకు వస్తాడు.
విలననిజంలో విలక్షణ పాత్రలో రావు గోపాలరావు , ఆయన అనుచరులుగా గొల్లపూడి మారుతీరావు , కోట శ్రీనివాసరావు నటన అద్భుతః. సుధాకర్ , ప్రసాద్ బాబు కామెడీ… అన్నపూర్ణ , సూర్యకాంతం , హరిప్రసాద్ , డా శివప్రసాద్ వయ్యారాల వై విజయ,మమత నటించారు.
తెలుగు సినీ ఆస్థాన యమ పాత్రధారి కైకాల సత్యనారాయణ యముడిగా, చిత్రగుప్తునిగా మరో ఆస్థాన చిత్రగుప్తుడు అల్లు రామలింగయ్య , సరి కొత్త సృష్టి పాత్ర విచిత్రగుప్తుడుగా సుత్తి వేలు , ఇతర పాత్ర లలో నటించారు .
చిరంజీవి సినిమా అంటే పాటలు , డాన్సులతో పాటు , ఫైట్లు కూడా కదా … స్టంట్ మాస్టర్ రాజు ఆధ్వర్యంలో ఫైట్లన్నీ బాగుంటాయి . ఆ రోజుల్లో అభిమానులు చేతులకు తాడు కట్టించుకుని చేసే ఫైట్ కోసం మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్ళు ఉన్నారు.
కథ విషయానికి వస్తే కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్థి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. చిత్ర గుప్తుని తప్పు వల్ల తను చనిపోయాడని తెలుసు కున్న యముడు వేరే శరీరంలోకి ప్రవేశపెట్టడం. ఆ బాలరాజు పాత్ర లోకి కాళీ వచ్చిన తరువాత జరిగే సన్నివేశాలు తో చిత్రం అనేక మలుపులు తిరుగుతుంది.
కాళి వర్సెస్ బాలరాజు పాత్రల్లో చిరంజీవి యమలోకాన్ని దడదడలాడించేలా, కాసేపు అమాయకపు బాలరాజు గా, తర్వాత కాళి ప్రవేశించిన బాలరాజు గా అదరగొట్టేశాడు, ఇంక అందరినీ క్రమశిక్షణ లో పెట్టే ప్రయత్నంలో పాపం టోటల్ గా తానే క్రమశిక్షణ తప్పి ఇంట్లో క్రమశిక్షణ అనే మాటే లేకుండా చేసిన బాబాయ్ పాత్రలో నటవిరాట్ రావుగోపాలరావు నటన ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. యముడు అంటే కైకాల సత్యనారాయణ మాత్రమే అని మరోసారి రంజింపజేశారు కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య చిత్రగుప్తుడిగా మరోసారి మురిపించగా, కొత్త పాత్రలో విచిత్రగుప్తుడిగా సుత్తి వేలు మెరిపించారు, రావు గోపాలరావు భార్య గా, బాలరాజు పిన్నిగా వై.విజయ, తమ్ముడన్నయ్య గా ప్రసాద్ బాబు సీన్స్ ఇప్పటికీ టీవీ చానల్స్ లో మురిపిస్తుంటాయి.
“యముడికి మొగుడు” తర్వాత మళ్లీ చిరు డబల్ రోల్ లో నటించి, సూపర్ హిట్ అందుకున్న మూవీ “రౌడీ అల్లుడు”…. 1987 పసివాడి ప్రాణం, 1988 యముడికి మొగుడు, 1989 అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, 1990 జగదీక వీరుడు, 1991 లో రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, 1992 ఘరానా మొగుడు కంటిన్యూ గా 6 ఇయర్స్ చిరంజీవి దుమ్ము దులిపాడు.
