సినిమా వార్తలు

మానవ-ఏనుగు ఘర్షణలకు చెక్.. రంగంలోకి దిగిన ‘జయంత్’, ‘అభిమన్యు’, కుంకీలకు పవన్ కళ్యాణ్ వీడ్కోలు

Published by
Rahul N

పార్వతీపురం మన్యం జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న మానవ-ఏనుగు ఘర్షణలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరంలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ‘జయంత్’, ‘అభిమన్యు’లను గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తోంది. ఈ ప్రయాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు.

కుంకీ ఏనుగులు ప్రయాణిస్తున్న వాహనాలు క్యాంపు కార్యాలయానికి చేరుకోగానే పవన్ కళ్యాణ్ వాటిపై పూలు చల్లి స్వాగతం పలికారు. అనంతరం వాటికి అరటిపండ్లు, ఇతర ఆహారం స్వయంగా అందించి ఆప్యాయంగా పలకరించారు. తర్వాత గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన రెండో దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ప్రయాణం సురక్షితంగా ఉండాలన్న పవన్

కుంకీల తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుచ్చిమి శిబిరానికి చేరుకున్న తర్వాత అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయంత్, అభిమన్యు సేవలు పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించడంలో ఎంతో కీలకంగా మారనున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలు, వన్యప్రాణుల సంరక్షణ మధ్య సమతుల్యతను కాపాడే దిశగా ప్రభుత్వం శాస్త్రీయ విధానాలతో ముందుకు సాగుతోందన్నారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న సమస్య

ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి ఏనుగుల గుంపులు తరచూ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో వ్యవసాయ పంటలు, ఆస్తులకు నష్టం వాటిల్లడమే కాకుండా స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దింపుతున్నారు.

అనుభవజ్ఞులైన కుంకీలు

‘జయంత్’, ‘అభిమన్యు’ సాధారణ ఏనుగులు కావు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు ఆపరేషన్లలో అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అడవుల్లోకి మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. ఆ అనుభవంతోనే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా వీటి సేవలను వినియోగించనున్నారు.

అటవీ శాఖ అధికారులు ఆశిస్తున్నట్లుగా, ఈ కుంకీల రాకతో ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం సులభమై, ప్రజల భద్రతతో పాటు రైతుల పంటలను కూడా కాపాడే అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Rahul N

Recent Posts