ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్న నిరాశకు గురయ్యారు. చివరికి వారి నిరీక్షణకు నేడు తెరపడింది. ఓజీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన క్షణం నుండి సోషల్ మీడియాలో అగ్రి తుఫాను సృష్టిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలను ఆకాశానికెత్తేసింది. పవన్ కళ్యాణ్ తిరిగి గర్జించిన తీరు అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేసింది.
ఈసారి పవన్ లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ అన్నీ వింటేజ్ లెవెల్‌లో ఉన్నాయి. గంభీరతతో నిండిన స్క్రీన్ ప్రెజెన్స్, శక్తివంతమైన డైలాగులు చూసి అభిమానులు ఫిదా అయ్యారు. సుజీత్ ట్రైలర్‌ను మాస్, క్లాస్ రెండింటికీ సరిపోయేలా యాక్షన్, డ్రామా, స్టైల్ మిక్స్ చేసి వడ్డించాడు. పవన్-ఇమ్రాన్ హష్మీ మధ్య క్లాష్ చూపించిన తీరు ఉత్కంఠను పెంచింది.
ట్రైలర్ కి అభిమానులు పెడుతున్న కామెంట్లు ఇక మామూలుగా లేవు…
ఇక టెక్నికల్ వైపు చూస్తే రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస అందించిన విజువల్స్ కట్టిపడేశాయి. నవీన్ నూలి ఎడిటింగ్ పటిష్టంగా ఉంది. తమన్ ఎస్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడిచేలా చేసింది.
ట్రైలర్ ఒక్కటే సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. సోషల్ మీడియా అంతా ఓజీ ట్రైలర్ ఫెస్టివల్‌గా మారిపోయింది. సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తుందని అంచనా వేస్తున్నాయి.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 25, 2025న ఈ సంవత్సరం గొప్ప సినిమాటిక్ ఈవెంట్‌గా ఓజీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.