Download App

తెలంగాణలో జనసేన రాజకీయ శక్తి గా మారుతుందా…

జూన్ 22, 2026 By Suresh Thota
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ విస్తరణ అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించిన తరువాత రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఒకవైపు యువతలో, ముఖ్యంగా Gen-Z వర్గంలో పవన్ కళ్యాణ్‌కు గణనీయమైన...
తెలంగాణలో జనసేన రాజకీయ శక్తి గా మారుతుందా…

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ విస్తరణ అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించిన తరువాత రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఒకవైపు యువతలో, ముఖ్యంగా Gen-Z వర్గంలో పవన్ కళ్యాణ్‌కు గణనీయమైన గుర్తింపు ఉందని విశ్లేషకులు చెబుతుండగా, మరోవైపు “తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీకి స్థలం లేదు” అని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. ఈ రెండు వాదనల మధ్యే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో ఉన్న అతిపెద్ద బలం ఆయన వ్యక్తిత్వం మరియు ఆయన నిజాయితీ, రాజకీయాల్లో తరచూ కనిపించే అధికార ధోరణికి భిన్నంగా మాట్లాడటం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, యువతతో నేరుగా అనుసంధానం కావడం వంటి అంశాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో వ్యక్తిగత ఇమేజ్ రాజకీయ ప్రభావాన్ని పెంచుతున్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ పేరు తెలంగాణ యువతలో కూడా చర్చకు వస్తోంది. అయితే ప్రజాదరణ, అభిమాన సంఘాలు, సోషల్ మీడియా మద్దతు ఎన్నికల విజయానికి నేరుగా, దగ్గిర దారి కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

తెలంగాణలో జనసేనకు ఎదురయ్యే మొదటి రాజకీయ సవాలు “తెలంగాణ సెంటిమెంట్” అంశం. రాష్ట్ర ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ చైతన్యం ఇప్పటికి కొంత మార్పు చెందినప్పటికీ, పూర్తిగా కనుమరుగు కాలేదు…. కాదు కూడానేమో, ఇంకా కొందరు నాయకులు ఇదే పంథాలో చలామణి కావడానికే మొగ్గు చూపుతున్నారు, ముఖ్యంగా ప్రాంతీయ భావజాలాన్ని ముందుకు తెచ్చే వర్గాలు, జనసేనను ఇప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చెందిన పార్టీగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే “తెలంగాణలో జనసేనకు స్థలం లేదు”, “ఇక్కడి రాజకీయాలను స్థానిక పార్టీలే నిర్ణయిస్తాయి” అనే వ్యాఖ్యలు తరచూ వినిపిస్తున్నాయి.

అయితే మరో కోణం కూడా ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పనిచేసే హక్కు కలిగి ఉంటుంది. బీజేపీ గుజరాత్‌లో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ నుంచి పంజాబ్ వరకు వెళ్లింది. ప్రాంతీయంగా ప్రారంభమైన అనేక పార్టీలు కాలక్రమేణా ఇతర రాష్ట్రాల్లో కూడా అడుగుపెట్టాయి. కాబట్టి “ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉండకూడదు” అనే వాదన రాజకీయ నినాదంగా వినిపించవచ్చు గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అంతిమ నిర్ణయం కాదు. చివరికి తీర్పు చెప్పేది ఓటరే.

తెలంగాణలో జనసేన రాజకీయ శక్తి గా మారుతుందా…

అయితే జనసేనకు ఉన్న అసలు సవాలు తెలంగాణ సెంటిమెంట్ కాదు, పార్టీ నిర్మాణం…. పవన్ కళ్యాణ్‌కు వ్యక్తిగతంగా ఉన్న ఆదరణను గ్రామ స్థాయి, వార్డు స్థాయి, బూత్ స్థాయి రాజకీయ వ్యవస్థగా మార్చగలగడం కీలకం. అభిమానులు ఉండటం ఒక విషయం ఐతే, ఎన్నికల రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే పార్టీ యంత్రాంగం ఉండటం మరో విషయం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సంవత్సరాలుగా నిర్మించుకున్న స్థానిక నాయకత్వ వ్యవస్థతో పోలిస్తే జనసేన పార్టీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా, అలాగని ఇతర పార్టీలు జనసేనను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కారణం…. తెలంగాణలో అనేక నియోజకవర్గాల్లో గెలుపుకి ఓటమికి తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ 2 నుంచి 5 శాతం ఓట్లను ప్రభావితం చేసినా రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తెలంగాణ లో కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో ప్రత్యక్ష బలం కంటే, భవిష్యత్తులో పెరిగే అవకాశం కూడా సమానంగా ప్రాధాన్యం కలిగి ఉంటుంది.

మొత్తంగా చూస్తే, తెలంగాణలో జనసేన భవిష్యత్తు గురించి ఇప్పుడే ఖచ్చితమైన తీర్పు ఇవ్వడం తొందరపాటు అవుతుంది. పవన్ కళ్యాణ్‌కు గుర్తింపు ఉంది, యువతలో ఆకర్షణ ఉంది, రాజకీయాలను, రాజకీయచర్చను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంది. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్, స్థానిక రాజకీయ వాస్తవాలు, బలమైన పార్టీ నిర్మాణం అవసరం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం జనసేన తెలంగాణలో ఒక స్థిరపడిన రాజకీయ శక్తి కాదు….. కాని దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేని రాజకీయ వైచిత్రి. రాబోయే స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణం, ప్రజలతో ప్రత్యక్ష అనుసంధానం ఇవే తెలంగాణలో జనసేన భవిష్యత్తును నిర్ణయించే అసలు ప్రమాణాలు.

బీజేపీ కూడా ప్రస్తుతానికి తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేస్తాం అంటుంది. BRS నేత కేటీఆర్ జనసేన మీద స్వల్ప విమర్శలకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముందు కొంచెం స్పీడ్ గా స్పందించినప్పటికీ, తరువాత సన్నాయి నొక్కుల వంటి విమర్శలు వద్దే ఆగిపోయింది. ఎందుకంటే జనసేన ఓటింగ్ శాతం కొంతమేరకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లో కూడా ఉంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ప్రాంతీయ తత్వం గురించి ఎక్కువగా స్పందించలేకపోతుంది. ఇక TRS నుండి BRS గా రూపాంతరం చెందటం తో వీరి నోటికి తాళం పడ్డట్లు గా అయ్యింది.

పవన్ కళ్యాణ్ ఎత్తుకుంటున్న నినాదం “దేశ సమగ్రత నే నాకు ముఖ్యం”….. ముఖ్యమంత్రి పదవి కాదు, అనడంతో ఎవరూ మాట్లాడలేని సంక్లిష్టంగా తెలంగాణ రాజకీయాలు మారాయి. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ తిట్టిన కొందరు అదే పార్టీ పేరు మీద పోటీ చేసినా ఆశ్చర్యం పొనక్కరలేదు. రాజకీయాలు అంటే ఇలానే ఉంటాయేమో…. వేచి చూద్దాం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading